ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులను ఉంచి అర్చకులు భక్తులకు కంకణాలు కట్టి క్రతువును నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత కంకణధారణ, యజ్ఞోపవీతం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక వరుస క్రమంలో నిర్వహించారు. మంత్రపుష్పం సమర్పించారు. అంతకుముందు గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

వెంకన్న హుండీ ఆదాయం రూ.40.85 లక్షలు

ఎర్రుపాలెం, వెలుగు: తెలంగాణ తిరుపతిగా భావించే జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీలను గురువారం లెక్కించారు. 72  రోజుల్లో రూ.40,85,700 ఆదాయం వచ్చినట్లు టెంపుల్ ఈవో జగన్మోహన్ రావు తెలిపారు. ఖమ్మం దేవాదాయ శాఖ అధికారి ఆర్  సమత పర్యవేక్షణలో లెక్కించినట్లు చెప్పారు. వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్ శర్మ, సూపరింటెండెంట్  శ్రీనివాస్, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ విజయ కుమారి పాల్గొన్నారు. 

26 మంది పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్​ నోటీసులివ్వండి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాల్లో వెనకబడి ఉన్న 26 మంది పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని డీపీవో రమాకాంత్​ను కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలపై పంచాయతీ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో దశలో ఓడీఎఫ్​ ప్లస్​గా ప్రకటించిన 250 గ్రామాల్లో అసెస్​మెంట్​ చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో కొందరి నిర్లక్ష్యంతో జిల్లా వెనకబడి ఉందన్నారు. చర్ల మండలం వెనుకబడి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్​​లో వచ్చే ఏడాది పంచాయతీలు అవార్డులు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ నెల 17 లోగా క్రీడా ప్రాంగణాలు, మెగా పార్కుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీవోను స్పెషల్​ ఆఫీసర్​గా నియమిస్తున్నట్టు తెలిపారు. జడ్పీ సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూధనరాజు, డీపీవో రమాకాంత్, ఉద్యాన అధికారి మరియన్న, అశోక్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

బీజేపీ గెలుపు కోసం పాటుపడాలి

చండ్రుగొండ, వెలుగు: అశ్వారావుపేట నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని నియోజకవర్గ ఇన్​చార్జి భుక్యా ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం మండలకేంద్రంలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బూత్​ కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బోగి కృష్ణయ్య, గొట్టిపల్లి శ్రీనివాస్, విశ్వేశ్వరరావు, గుగులోతు మోహన్ నాయక్, నల్లమోతు రఘుపతిరావు, గుగులోత్ జ్యోతి, గుగులోత్​ నీలవర్ణ, భుక్యా రాంపండు, రాజేశ్, రాంబాబు, బాలు, కిరణ్, నరేశ్​రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా పోరాటాలే ఎజెండా

ఖమ్మం రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం కృషి చేస్తుందని, ప్రజా పోరాటాలే ఎజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ పాలేరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట క్రాస్ రోడ్డులోని ఫంక్షన్ హాల్​లో గురువారం పుచ్చకాయల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పారు. రాజకీయ పొత్తులు తాత్కాలికమేనని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడతామన్నారు. ఖమ్మం రూరల్​ సీఐ శ్రీనివాస్​తీరుపై సీపీఐ ఆందోళనల నేపథ్యంలో ఆయనను ట్రాన్స్​ఫర్​చేయిస్తానని ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి మాట ఇచ్చి తప్పారని అన్నారు. ఇప్పటికైనా సీఐ పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అనంతరం 25 మందితో పాలేరు నియోజకవర్గ ఎన్నికల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్,  జిల్లా కార్యవర్గ సభ్యులు అజ్మీర రామ్మూర్తి నాయక్, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.