ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్​, వెలుగు : ప్రజల అవసరాలు తీర్చేందుకు పాలకవర్గం, అధికారులు కృషి చేయాలని మెదక్​ మున్సిపల్​కౌన్సిలర్లు సూచించారు. మంగళవారం మెదక్​ మున్సిపల్​ జనరల్​ బాడీ మీటింగ్​ చైర్మన్​ చంద్రపాల్​ అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో అనుకున్న పనులు ఇప్పటివరకు పూర్తి చేయలేదని ప్రజల సమస్యలు తీర్చాల్సి అవసరం ఉందన్నారు. మున్సిపాలిటిలో కలిసిన గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో మరిన్ని క్రీడా పరికరాలు సమకూర్చాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని గుర్తుచేశారు. అనంతరం కౌన్సిలర్లు తమ వార్డుల్లో లేవనెత్తిన సమస్యలను అధికారులు, సిబ్బంది యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని చైర్మన్​ చంద్రపాల్​అన్నారు. సమావేశంలో  వైస్ చైర్మన్​మల్లిఖార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, కమిషనర్​ జానకి, డిప్యూటీ ఈఈ  మహేశ్ పాల్గొన్నారు. 

18 అంశాలకు ఆమోదం 

జోగిపేట, వెలుగు: జోగిపేట మున్సిపల్ జనరల్​బాడీ మీటింగ్ ​మంగళవారం చైర్మన్ గూడెం మల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. సభ్యులు మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో కావలసిన 18 అంశాలపై చర్చించి ఆమోదించారు. ఆమోదించిన అంశాలకు రూ.50 లక్షలు అంచనా ఖర్చుగా తీర్మానం చేసి కౌన్సిల్​ఆమోదించినట్లు కమిషనర్ రవిబాబు తెలిపారు.

ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం..మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్​ కోసం రోడ్లు వేసేందుకు పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జేసీబీతో ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారం కోసం దేవుడి విగ్రహం ధ్వంసం కావడం తమ గ్రామానికి అరిష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

రామాయంపేటను రెవెన్యూ డివిజన్​ చేయాలి

రామాయంపేట, వెలుగు: రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టౌన్ లో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇందిరా గాంధీ విగ్రహం నుంచి తహసీల్​ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా  టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు మాట్లాడుతూ గతంలో  రెవెన్యూ డివిజన్ కోసం 183 రోజులు ఉద్యమం చేశామని గుర్తు చేశారు. అప్పుడు మంత్రి హరీశ్​రావు హామీ ఇచ్చారని, అయినా డివిజన్​ ఏర్పాటు కాలేదన్నారు. త్వరలో డివిజన్ ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ​ నాయకులు బాలకృష్ణ, శంకర్ గౌడ్, అశ్విని శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

కేసీఆర్ దీక్ష చరిత్రాత్మకం 

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్రాత్మకమని, అది తెలంగాణ ప్రజలకు పవిత్ర దినమని రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, టీఆర్ఎస్​ టౌన్ ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి అన్నారు. తెలంగాణ దీక్ష దివాస్ ను పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకొని ఉండకపోతే నేటికీ రాష్ట్రం సాకారం అయ్యేది కాదన్నారు. నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 


బీజేపీతోనే అవినీతి అంతం

  
పటాన్​చెరు, వెలుగు:
రాష్ట్రంలో అవినీతిని అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమని పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు నందీశ్వర్​ గౌడ్​ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం  కొత్త పల్లి, నల్లవల్లి, నాగిరెడ్డి గూడెం గ్రామాలలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని అంతమొందించేందుకు బీజేపీ వస్తుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. కార్యక్రమంలో  అమీన్ పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేశ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, కుమార్, కె.రాజశేకర్, యాదగిరి పాల్గొన్నారు.  

సెంట్రల్​ స్కీమ్స్​పై అవగాహన కల్పించాలి

సదాశివపేట, వెలుగు: ప్రజల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ అన్నారు. మంగళవారం సదాశివపేట మండలం ఆరూర్​లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్​  రాజరిక పాలన కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు  సంగమేశ్వర, శివరాజ్ పాటిల్, వేణుమాధవ్, హరీశ్​కుమార్, సార కృష్ణ, సత్యనారాయణ, అంబదాస్ పాల్గొన్నారు.

 

నష్టపరిహారం తేల్చకుండా సర్వే చేయొద్దు


కొండాపూర్, వెలుగు: రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డులో పోతున్న భూములకు నష్టపరిహారం తేల్చకుండా సర్వే చేయొద్దని రైతులు డిమాండ్​చేశారు. మంగళవారం కొండాపూర్‌‌, సదాశివపేట మండలం గిర్మాపూర్‌‌, పెద్దాపూర్‌‌  శివారులో  సర్వే చేసేందుకు వచ్చిన ఆఫీసర్లను టీజేఎస్​జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి, రైతులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు రైతులకు సర్వే ఆఫీసర్లకు  మధ్య తోపులాట జరిగింది.   విషయం తెలుసుకున్న సీఐ సంతోష్‌‌కుమార్‌‌ ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్‌‌ చేసి బుదేరా స్టేషన్‌‌కు తరలించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ట్రిపుల్​ఆర్ ఫస్ట్ ఫేజ్​ నోటిఫికేషన్  మాదిరిగానే సర్వే చేయాలని, కొంత మంది రాజకీయ నాయకుల భూములు కోల్పోతుండడంతో ప్లాన్‌‌ మార్చారని  ఆరోపించారు. రోడ్డు కోసం భూమి నష్టపోతున్న రైతులకు పరిహారం ఎంత చెల్లిస్తారో ప్రకటించకుండా సర్వే చేయడం సరికాదన్నారు.


రేపు జాబ్ మేళా


సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న సంగారెడ్డిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారి వందన ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాల కోసం డిసెంబర్ 1న ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని జిల్లా ఉపాధి ఆఫీసులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.