నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్​, వెలుగు:  దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన భారతీయులను స్మరించుకుంటూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో  మౌనయాత్ర నిర్వహించారు. జిల్లా పార్టీ ఆఫీస్​నుంచి కార్గిల్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్ర్యం సంతోషాన్నే కాకుండా, దుఃఖాన్ని కూడా తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ధన్ పాల్ సూర్యనారాయణ,  దినేశ్, మల్లికార్జున్ రెడ్డి,  న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

నరనరాన దేశభక్తి

ప్రతి భారతీయుడి నరనరాన దేశభక్తి  ఉప్పొంగుతోందని బీజేపీ  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం  బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ నేతల విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకోవడం మన ధర్మమన్నారు.  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి,  ప్రధాన కార్య దర్శి విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నవీపేట మండల కేంద్రంలో వజ్రోత్సవాల సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న దేశభక్తుల, జాతీయ నాయకుల  విగ్రహాలను ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో  గంగాజలంతో శుద్ధిచేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

వార్కారీల పాదయాత్రలో బీజేపీ లీడర్లు

పిట్లం, వెలుగు: శ్రావణమాసం సందర్భంగా జుక్కల్​కు చెందిన వార్కారి భక్తులు లాడేగాం నుంచి పిట్లం మండలం చిన్నకొడప్​గల్​ రామలింగేశ్వర ఆలయానికి పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొన్నారు. లాడేగాంలో ఆలయంలో భక్తులను కలిసిన అరుణతార వారితో కలిసి నడుస్తూ జుక్కల్​, ఖండేభల్లూర్​, జగన్నాథ్​పల్లి, పెద్దకొడప్​గల్​, చిన్నకొడప్​గల్​ మీదుగా రామలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ వార్కారీలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.  బీజేపీ జిల్లా కార్యదర్శి రాము, పిట్లం, జుక్కల్​, పెద్దకొడప్ గల్​ మండలాల బీజేపీ అధ్యక్షులు  పాల్గొన్నారు.

నేటి తరానికి జాతీయ జెండా ప్రాముఖ్యత తెలియదు

బాన్సువాడ, వెలుగు:   నేటి తరానికి జాతీయ జెండా ప్రాముఖ్యత తెలియదని స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం బాన్సువాడ  పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో  నిర్వహిస్తున్న జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి స్పీకర్​హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎంతో మంది మహనీయులు స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించారన్నారు. ఆర్డీవో రాజా గౌడ్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్,  కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

తీజ్​ పండుగలో స్పీకర్ 

పోచారం తండా, రాంపూర్ తండాలలో లంబాడీలు జరుపుకున్న తీజ్ వేడుకలకు స్పీకర్​హాజరయ్యారు.  ఈ సందర్భంగా తీజ్​గడ్డి బుట్ట ఎత్తుకుని గిరిజన మహిళలతో డ్యాన్స్​చేశారు.  డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పండుగలా వజ్రోత్సవ వేడుకలు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ‘హైదరాబాద్ సైకిల్ గ్రూప్’ చేపట్టిన ‘తిరంగా సైకిల్ యాత్రను’ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.  హైదరాబాద్ సైకిల్ గ్రూప్ మెంబర్లు 350 మంది  కుత్బుల్లాపూర్ నుంచి100 కిలో మీటర్ల సైకిల్ యాత్రను హైదరాబాద్౼నాగపూర్ హైవేపై చేపట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బాన్సువాడ కు వెళ్తున్న స్పీకర్  మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ సైకిల్ యాత్ర చూసి ఆగి వారితో మాట్లాడారు.   

స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్​ పార్టీ కీలకం

కుమ్మర్​పల్లి/ పిట్లం, వెలుగు:  స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్​ పార్టీ పాత్ర కీలకమని,  బీజేపీది ఎలాంటి పాత్ర లేదని పీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​మహేశ్​ కుమార్​గౌడ్​అన్నారు. ఆజాదీకా గౌరవ్​ యాత్రలో భాగంగా ఆదివారం  కమ్మర్ పల్లి మండలంలో చౌట్ పల్లి  నుంచి హాసకొత్తూర్, ఉప్లూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. హాజరైన మహేశ్​గౌడ్ ​మాట్లాడుతూ బీజేపీ లీడర్లు తామే దేశభక్తులమని ప్రగల్భాలు పలుకుతున్నారని, స్వాతంత్ర్య ఉద్యమంలో  వారి పాత్ర ఏమిటో చెప్పాలని సవాల్​ విసిరారు.  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​ధరలు పెంచి  మోయలేని భారం మోపిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్లు కాళేశ్వరం పేరుతో గోదావరిలో పోసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్,  తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​గెలుపు పక్కా..

జుక్కల్​ కాంగ్రెస్​ ఇన్​చార్జి సౌదాగర్​ గంగారాం ఆధ్వర్యంలో బిచ్కుంద మండలం కందర్​పల్లి నుంచి మద్నూర్​ మండల కేంద్రం వరకు  ఆదివారం ఆజాదీకా గౌరవ్​యాత్ర నిర్వహించారు. హాజరైన ఎన్ఎస్​యూఐ స్టేట్​ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.  వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్​కైలాష్​  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సేవలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

బోధన్​/నిజామాబాద్​టౌన్​, వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు తమ సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని  ఆర్టీసీ ఎండీ సీవీ సజ్జనార్​ అన్నారు. ఆదివారం నిజామాబాద్, బోధన్​ లో ఆర్టీసీ డిపోలను ఆయన తనిఖీ చేశారు.  వజ్రోత్సవాలను పురస్కరించుకుని బస్టాండ్​లలో జాతీయ గీతాలపన చేశారు.  అనంతరం ఆర్ఎం ఆఫీస్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆర్టీసీని డెవలప్​చేయడానికి వివిధ  స్కీమ్ లు, ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు 45లక్షలమంది ప్రయాణికులు బస్సుల్లో  ప్రయాణించినట్లు తెలిపారు. అలాగే స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా  ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12యేండ్ల వరకు ఫ్రీగా ప్రయాణం,75యేండ్లు పైబడిన వృద్ధులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.  అనంతరం బస్ డిపోలో మొక్కలు నాటారు.  డిపో మేనేజర్ టీఎన్​స్వామి, సీటీఐ మంజుల, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.  

ప్రతిభకు  పేదరికం అడ్డుకాదు

పేదరికం అడ్డుకాదని కామారెడ్డి  కలెక్టర్ జితేశ్​వి పాటిల్​అన్నారు. కెనరా బ్యాంక్​ ఆధ్వర్యంలో  ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లకు నిర్వహించిన టాలెంట్​ టెస్టులో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన​ మాట్లాడుతూ..కష్టపడకుండా, ఇష్టపడి చదివితే  విజయం సాధ్యమవుతుందన్నారు.  లీడ్​ బ్యాంక్ మేనేజర్ చిందం రమేశ్,  ఎస్టీ వెల్ఫేర్​ జిల్లా అధికారి అంబాజీ, బ్యాంక్​ఆఫీసర్లు పాల్గొన్నారు. 

గ్రామీణ కళాకారులకు ప్రోత్సాహం

కామారెడ్డి/ నిజామాబాద్ ​టౌన్, వెలుగు: గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని  ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, జడ్పీ చైర్మన్​ విఠల్​రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్ అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్​ , కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో న్యూ అంబేద్కర్​భవన్​, కళాభారతి ఆడిటోరియంలో  జానపద కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. హాజరైన వారు మాట్లాడుతూ ప్రాచీన కళలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతాయన్నారు. పురాతన నాటకాల్లో  మధురమైన జ్ఞాపకాలు దాగి ఉంటాయన్నారు.  ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి , అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

సిమెంట్ ఐరన్ షాప్ లో చోరీ

ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి టౌన్ లోని శ్రీ లక్ష్మి ట్రేడర్ సిమెంట్, ఐరన్ షాప్ లో ఆదివారం సుమారు లక్షరూపాయల విలువ చేసే వస్తువుల చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన  నలుగురు మైనర్లు వారం రోజులుగా  షాపు వెనుకభాగం కిటికీ నుంచి చొరబడి  ఇనుప సీకులు, ప్రేమ్​లు చోరీ చేశారు. అనుమానం వచ్చిన యజమాని శ్రీధర్ సీసీ పుటేజీ చెక్​చేసి పోలీసులకు కంప్లైంట్​చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం ఒప్పుకున్న మైనర్లు పట్టణంలోని ఓ కొనుగోలు  వ్యాపారికి అమ్మినట్లు చెప్పడంతో అతడిపై కూడా  కేసు ఫైల్​చేసినట్లు పోలీసులు తెలిపారు.