చనిపోయిన చెట్లకి తిరిగి ప్రాణం పోస్తుండు

చనిపోయిన చెట్లకి  తిరిగి ప్రాణం పోస్తుండు

చెట్టు నీడనిస్తుంది.. చెట్టు ఆకలి తీరుస్తుంది.. చెట్టు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అదే చెట్టు మన గూడు కోసం నేలకొరుగుతోంది. అన్నం వండే పాత్రయ్యి అవసరం తీరుస్తోంది. మన కంఫర్ట్స్​ కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తోంది. ఇంత నిస్వార్థమైన ప్రేమ ఈ భూమ్మీద  ఇంకెక్కడ ఉంటుంది? అందుకే దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆ ఆలోచనతోనే  చనిపోయిన చెట్లకి  తిరిగి ప్రాణం పోస్తున్నాడు సింగరేణి ఆర్జీ 1 ఏరియా జనరల్‌‌ మేనేజర్‌‌ కె.నారాయణ. చెట్ల మనుగడ కోసం  ఈయన చేసిన పని ఎందర్నో కదిలిస్తోంది ఇప్పుడు. కొత్త బిల్డింగ్​ కట్టాలన్నా.. కొత్తగా రోడ్డు పడాలన్నా చుట్టుపక్కలున్న చెట్లన్నీ నేలకొరుగుతయ్​. వాటి కర్రలు ఫర్నిచర్​గా మారిపోతయ్​.. ఇది ప్రతిచోటా చూసేదే. కానీ, నారాయణ మాత్రం అలా నరికిన చెట్లని తిరిగి బతికించాలి అనుకున్నాడు. ఆ ఆలోచనకి ప్రాణం పోసి ఓ మినీ అడవిని సృష్టించాడు. 
అదెలాగంటే.. 
సింగరేణి రామగుండం రీజియన్‌‌ పరిధిలోని గోదావరిఖనిలో ఫైవింక్లయిన్ రోడ్డును వెడల్పు చేస్తున్నారు. ఆ ఏరియాలో  ఓ నర్సరీలో 17 సంవత్సరాల కిందట నాటిన  మర్రి చెట్లు ఉన్నాయి. వాటిని కొట్టేస్తే  ఓ ప్రాణం తీసినట్టే అనిపించింది నారాయణకి. అంతే  కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆ  మర్రి చెట్ల వేర్లకు ఎలాంటి నష్టం కలగకుండా 3.5 మీటర్ల లోతు వరకు కందకం తీయించాడు. వాటి వేర్లు కత్తిరించి ఫంగస్‌‌ రాకుండా బావిస్టన్‌‌, బ్లూ కాపర్‌‌ ఉన్న పేస్ట్‌‌ రాసి నర్సరీలో నాటించాడు. ఇప్పుడు ఆ చెట్లు ఏపుగా పెరిగి చల్లటి గాలులతో పలకరిస్తున్నాయి. 
అడివిని తలపిస్తోంది
జీడికె 3వ మైన్‌‌ నుంచి సింగిరెడ్డిపల్లె మీదుగా మంథనికి మెయిన్‌‌ రోడ్డు వేస్తుండగా 65 మామిడి చెట్లు, 5 ఎర్ర చందనం చెట్లు అడ్డొచ్చాయి. వాటినీ వేర్లతో సహా పీకి కొత్త నర్సరీలో నాటించాడు. ఒక్కో చెట్టును తీసుకెళ్లడానికి దాదాపు రూ.3 వేల వరకు ఖర్చు చేశాడు. ఇప్పుడా చెట్లన్నీ నాటుకున్నాయి. ప్రస్తుతం నర్సరీలో వెదురు, నారేప, ఉసిరి, తావి, విప్ప, మర్రి, రావి, జువ్వి, వేప, పులి చింత, వెలగ, నేరేడు, మారేడు, పొగడ, చింత, టేకు తదితర అడవి జాతుల మొక్కలున్నాయి. వాటి గుబురుల్లో పక్షులు గూళ్లు కట్టుకుని ఉంటున్నాయి. మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు పక్షులు, జంతువులతో  అడవిని తలపిస్తోంది.                                       - శ్యామ్​ సుందర్​, గోదావరిఖని, వెలుగు