కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కొనసాగుతా

కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కొనసాగుతా

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కొత్త ప్రధానిని ఎన్నుకునేవరకు తాను పదవిలో కొనసాగుతానని ఆయన చెప్పారు. కొత్తగా ఎన్నిక కానున్న ప్రధానికి తాను ఇవ్వగలిగేంత మద్దతు ఇస్తానని జాన్సన్ వెల్లడించారు. తనను ఆదరించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన..  కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.  ప్రధానిగా ఉండడం ఒక ఎడ్యుకేషన్ అని, తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. ఒక్కోసారి పరిస్థితులు అంధకారంగా అనిపించినా బంగారు భవిష్యత్ ఉంటుంది అని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి ఇప్పటికే 54 మంది మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడంతో.. బోరిస్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.  

అనేక వివాదాల్లో చిక్కుకొని..

బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో కూడా బోరిస్‌ జాన్సన్‌ కు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్‌ బొటాబొటిగా బయటపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌ క్రిస్‌ పించర్‌ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. 2019లో ప్రధాని జాన్సన్‌... క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి.