బ్రో క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది

బ్రో క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది

‘విరూపాక్ష’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం ‘బ్రో’. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి తేజ్ నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఈనెల 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఇలా ముచ్చటించాడు. 

 యాక్సిడెంట్‌కు ముందే ఈ కథకు ఓకే చెప్పడం యాదృచ్చికంగా జరిగింది. నా సినిమా కెరీర్‌‌కు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ మావయ్యతో కలిసి నటించే అవకాశం కనుక వెంటనే ఓకే చెప్పా. ఒరిజినల్ వెర్షన్ కూడా చూడలేదు తర్వాత కథ వినగా చాలా నచ్చింది. నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. త్రివిక్రమ్ గారి లాంటి గొప్ప వ్యక్తి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన చిత్రంలో నటించడం అదృష్టం. నా కెరీర్‌‌కి ఇది ట్రిబ్యూట్ ఫిల్మ్.  షూటింగ్ ఫస్ట్ డే కొంత కంగారు పడ్డాను. మావయ్య పిలిచి కంగారు ఎందుకు.. నేనే కదా అంటూ టెన్షన్ రిలీఫ్ చేశారు. సముద్రఖని గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. సెట్‌లో ప్రతి క్షణం నాకు మెమొరబుల్ మూమెంటే. చిన్నప్పుడు నాతో మావయ్య ఎంత సరదాగా ఉండేవారో.. సెట్‌లోనూ అంతే సరదాగా ఆటపట్టించారు. చిన్నప్పటి నుండి ఆయనతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఒక మనిషి ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఎలాగో, ఆయన సపోర్ట్ కూడా నాకు అలాగే ఉంది. 
ఈ క్షణంలో బ్రతకడం గురించి చెప్పే గొప్ప సందేశం ఉన్న సినిమా ఇది. మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని కూడా చెబుతుంది. అలాగే కామెడీ, రొమాన్స్ లాంటి అన్ని కమర్షియల్  అంశాలు ఉన్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమన్ సంగీతం గురించి మాట్లాడుకుంటారు. క్లైమాక్స్​లో త్రివిక్రమ్‌ గారి డైలాగులు, తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కంటతడి పెట్టిస్తాయి. 

 మా ఫ్యామిలీ హీరోలతోనే కాదు.. మంచి కథ దొరికితే ఎవరితోనైనా కలిసి నటించడానికి రెడీ. ముఖ్యంగా రవితేజ గారు, ప్రభాస్ అన్నతో చేయాలని ఉంది. అలాగే నా ఫ్రెండ్ తారక్, మనోజ్ తోనూ నటించాలని ఉంది. ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలని నాకు ఆశ. ఇద్దరితో నటించేశా. చిరంజీవి మావయ్యతో కూడా కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

‘బ్రో’ షూటింగ్‌ టైమ్‌కు నేనింకా పూర్తిగా కోలుకోలేదు. మాట కూడా గట్టిగా రాకపోవడంతో డైలాగ్‌లు చెప్పేటప్పుడు ఇబ్బంది పడ్డా. డబ్బింగ్ కోసం బాగా కష్టపడ్డాను. మాట విలువ ఏంటో ఆ టైమ్‌లో తెలిసింది. నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం కోసం చిన్న బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నా. సంపత్ నంది దర్శకత్వంలో ఇప్పటికే ఒక మూవీకి ఒప్పుకున్నాను.