గులాబీ ఓటు ఎటు .. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలాపడ్డ కారు

గులాబీ ఓటు ఎటు .. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలాపడ్డ కారు
  • లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓట్లు చీలే చాన్స్​
  • ఆ ఓట్లు తమవైపు మలుపుకునేందుకు కాంగ్రెస్​, బీజేపీ వ్యూహాలు
  • జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్​ 

నెట్​వర్క్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ డీలా పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మళ్లుతాయన్న చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్.. పార్లమెంట్​ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం భిన్నమైన తీర్పును ఇస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్​సభ​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓట్ల శాతం తగ్గి.. ఆ మేరకు కాంగ్రెస్​, బీజేపీ లాభపడడమే ఇందుకు నిదర్శనం. కాగా, గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్​ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో కేడర్​తో పాటు సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాఫ్​పడిపోయింది. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్​ స్కామ్, ఫోన్​ ట్యాపింగ్​ తదితర వ్యవహారాలు బీఆర్​ఎస్​ ప్రతిష్టను మసకబార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లూ ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్​సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది. 

భారీగా తగ్గిన బీఆర్​ఎస్​ ఓటు​ షేర్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 46 శాతం ఓట్లు సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 పార్లమెంట్​ ఎన్నికల నాటికి 5 శాతం ఓటు షేర్​ కోల్పోయి 9 లోక్​సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓటింగ్​ శాతం ఏకంగా 37. 35కు పడిపోయింది. ఫలితంగా కేవలం 39 అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లతో ఒక సీటును  మాత్రమే గెలిచిన బీజేపీ.. 2019 పార్లమెంట్​ ఎన్నికల నాటికి తన ఓటింగ్​ను 19.45 శాతానికి పెంచుకుని ఏకంగా  4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్​ షేర్​ 13. 90 శాతానికి పడిపోయినా.. 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక 2018 ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్.. 2019 లోక్​సభ ఎన్నికల నాటికి ఒక శాతం ఓట్​షేర్​ పెంచుకొని  29. 48 శాతం ఓట్లతో మూడు లోక్​సభ సీట్లను గెలుచుకుంది. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.40 శాతం ఓట్లు సాధించి ఏకంగా 64 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు బీఆర్​ఎస్​ ఓట్​షేర్​ 8.65 శాతం తగ్గగా, కాంగ్రెస్​ ఓటుషేర్​ మాత్రం సుమారు 11శాతం పెరిగింది. అంటే బీఆర్ఎస్​ నుంచి దూరమైన ఓటర్లంతా గంపగుత్తగా కాంగ్రెస్​వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్​లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్​ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ పర్సంటేజీ మరింత తగ్గి.. కాంగ్రెస్​, బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేల్లోనూ ఇదే విషయం తేలుతుండడంతో గులాబీ పార్టీ ఓట్లను​తమవైపు తిప్పుకునేందుకు అటు కాంగ్రెస్​, ఇటు బీజేపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. 

ముక్కోణపు​ పోటీతో లాభమెవరికి?

రాష్ట్రంలో బీఆర్ఎస్​ బలహీనపడడంతో ఏడెనిమిది స్థానాల్లోనే ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోరు తమకంటే తమకే కలిసివస్తుందని కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్​ కూడా నమ్ముతున్నది. పాత హైదరాబాద్‌‌, -రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బలంగా కనిపిస్తున్నది. నియోజకవర్గాలవారీగా చూసినప్పుడు నిజామాబాద్‌‌, ఆదిలాబాద్​,  కరీంనగర్‌‌, సికింద్రాబాద్​, మల్కాజ్​గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామనే ధీమాలో కమలం పార్టీ ఉన్నా.. ఈ స్థానాలపై స్పెషల్ ఫోకస్  పెట్టిన సీఎం రేవంత్​రెడ్డి తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. 

కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపడంతో  పాటు వారిని గెలిపించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్​ నేతలందరినీ పిలిచి, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. అభ్యర్థులపరంగా మహబూబ్​నగర్​, భువనగిరి, నాగర్​కర్నూల్​, వరంగల్​స్థానాల్లో కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొన్నప్పటికీ బీజేపీకి బలమైన కేడర్​ లేకపోవడం కాస్త మైనస్. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు కచ్చితంగా గెలుస్తామని బీజేపీ భావిస్తున్న నిజామాబాద్​ ఎంపీ సెగ్మెంట్​లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 4,08,135 (32.7 శాతం) ఓట్లు, బీఆర్ఎస్​కు 4,17,315 (33.4 శాతం) ఓట్లు రాగా.. బీజేపీకి 3,65,374 (29.2శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మారిన పరిస్థితుల్లో బీఆర్​ఎస్​ నుంచి చీలే ఓట్లు భారీ మొత్తంలో బీజేపీకి పడ్తేనే సిట్టింగ్ ఎంపీ , అభ్యర్థి ధర్మపురి అర్వింద్​గెలిచే అవకాశం ఉంది. ఇక చేవెళ్లలాంటి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్​ 7,07,456 ఓట్లు, కాంగ్రెస్​6,09,527 ఓట్లు సాధించగా.. బీజేపీ 3,35,504 ఓట్లకే పరిమితమైంది. 

కాంగ్రెస్​లో నిజామాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్​రెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈ రెండు చోట్లా నువ్వా? నేనా? అనే పరిస్థితి ఉంది. కాగా.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్​, మహబూబ్​నగర్, ఆదిలాబాద్​ జిల్లాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో తాము పక్కా గెలుస్తామని, మిగిలిన నియోజకవర్గాల్లో త్రిముఖ పోరుకూడా తమకే అనుకూలిస్తుందని కాంగ్రెస్​ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం తామే అధికారంలో ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో తమ ఓట్లు చీలే అవకాశం లేదని, బీజేపీతో పోల్చినప్పుడు తమ ఓటుబ్యాంకు ఎక్కువ కాబట్టి, బీఆర్​ఎస్​ నుంచి చీలే ఓట్లు తమకు ఏమాత్రం కలిసి వచ్చినా మరో ఆరు నియోజకవర్గాలనూ కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తున్నారు.