బీఆర్ఎస్​లో జోకుడుగాళ్లు, చెంచాలకే విలువ.. కరీంనగర్లో ఉద్యమకారుల నిలదీత

బీఆర్ఎస్​లో జోకుడుగాళ్లు, చెంచాలకే విలువ.. కరీంనగర్లో ఉద్యమకారుల నిలదీత
  • అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలే
  •  కరీంనగర్​ లోక్​సభ ఎన్నికల సన్నాహక  మీటింగ్​లో ఉద్యమకారుడు శ్యామ్ నిలదీత 
  • పార్టీకోసం పనిచేసినోళ్లను గుర్తిస్తలేరని పెద్దపల్లిలోనూ లొల్లి

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రోజుకో చోట ఆ పార్టీ అధిష్టానానికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్​లో సోమవారం నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా..కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు శ్యామ్ తీవ్ర స్వరంతో నిరసన వ్యక్తం చేశారు. ‘కార్యకర్తలకు విలువ లేదు. కార్యకర్తలను పట్టించుకున్న లీడర్​ లేడు. వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీ ఓడిపోయింది. నేను ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్నా. నా మీద కేసులున్నాయి. ఉద్యమకారులకు విలువలేదు. కేవలం జోకుడుగాళ్లకు, చెంచాగాళ్లకు విలువ ఇచ్చిండ్లు. ఇప్పుడు లోక్​సభ ఎన్నికల్లో గెలుపు కోసమే  సమావేశాలు, కార్యకర్తల మీటింగులు పెడతున్నరు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేం గుర్తుకు రాలేదా. ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకోవాలే’ అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్యామ్ మాట్లాడుతున్నంత సేపు సమావేశంలోని వందలాది మంది కార్యకర్తలు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ మద్దతుగా నిలవడంతో వేదిక మీద ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిర్ఘాంతపోయారు. ఇన్నాళ్లు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకిన కార్యకర్తలు.. ఇప్పుడు ఓపెన్​గా విమర్శలు చేస్తుండడంతో పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.  

పార్టీ కోసం పనిచేసినోళ్లను గుర్తిస్తలేరని పెద్దపల్లిలో లొల్లి  

పెద్దపల్లి :  బీఆర్ఎస్​ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తలేరని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లను స్టేజీ ఎక్కిస్తున్నరని పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తబ్రేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో సోమవారం బీఆర్ఎస్​ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్​గెస్ట్​గా మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి పలువురు నాయకులను స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఈ క్రమంలో స్టేజీ కింద ఉన్న తబ్రేజ్​ స్టేజీపైకి దూసుకెళ్లి మాజీ ఎమ్మెల్యేను నిలదీస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వాళ్లను స్టేజీ మీదకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.  ఎన్నికల ముందు బీఆర్ఎస్​కు రాజీనామా చేసి, తిరిగి పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఇంపార్టెన్స్​ ఇవ్వడం ఏమిటన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలని కష్టపడ్డ తమ లాంటి కార్యకర్తలకు గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరికొంత మంది కార్యకర్తలు స్టేజీ వైపు దూసుకురావడంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. తర్వాత నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని కోరారు. జడ్పీ చైర్మన్​ పుట్ట మధుకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్​, చిరుమల్ల రాకేశ్​పాల్గొన్నారు.