
- స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన
- పోలీస్ స్టేషన్లోరెండు వర్గాల ఫిర్యాదులు
- ఎమ్మెల్యే కోనప్ప, ప్రవీణ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని సర్సిల్ సమీపంలో విజయ బస్తీ ప్రాంతంలో ప్రవీణ్కుమార్ఆధ్వర్యంలో బీఎస్పీ ర్యాలీ నిర్వహించింది. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రచార వాహనం కూడా పెద్దగా సౌండ్ పెట్టుకుని వచ్చింది. దీంతో బీఎస్పీ కార్యకర్తలు సౌండ్ తగ్గించాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే స్వయంగా ఆ వాహనం దగ్గరకు వెళ్లి సౌండ్ తగ్గించాలని కోరారు.
అయినా వినిపించుకోకపోవడంతో బీఎస్పీ, బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకుని ర్యాలీ నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు అడ్డుపడడం ఏమిటని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సురేశ్‌కుమార్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి ఎనిమిది గంటలకు...ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని పీఎస్వరకు ర్యాలీగా వెళ్లి స్టేషన్ ముందు బైఠాయించారు. తమ నాయకుల అంతు చూస్తామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులను ప్రవీణ్కుమార్నిలదీశారు. చివరకు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆందోళన విరమించారు.
బీఎస్పీ, బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. బీఎస్పీ లీడర్ల మీద బెదిరింపులకు సంబంధించి ఆ పార్టీ నేత సయ్యద్ ఫహీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోనప్పతో పాటు బీఆర్ఎస్ లీడర్లు అలీం, కోనేరు ఫణి, లలిత్ బల్హోత్రా, అన్షుమన్, కోనేరు వాసుతోపాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రచార రథం డ్రైవర్ అలీం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కొడుకు పునీత్, నాయకులు ఆర్షద్ హుస్సేన్ సహా 16 మంది మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాగజ్ నగర్ ఎస్ హెచ్ఓ బుద్దే స్వామి తెలిపారు.
నాపై దొంగతనం కేసు పెట్టిన్రు..
ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్సోమవారం మాట్లాడారు. డీఎస్పీ, సీఐలు బీఎస్పీదే తప్పన్నట్టు మాట్లాడారని, తాము కంప్లయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ఇవ్వడానికి మూడున్నర గంటలు తీసుకున్నారన్నారు. అడిషనల్ డీజీగా పనిచేసిన తన పరిస్థితే ఇలా ఉంటే మిగతావాళ్ల పరిస్థితి ఏమిటన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పిటిషన్ ఇస్తే తన మీద, ఇంట్లో చదువుకుంటున్న తన కొడుకు మీద, బీఎస్పీ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. తాను రూ.25 వేలు దొంగతనం చేసినట్లు కేసు పెట్టారని, ఆటో డ్రైవర్ దగ్గర దొంగతనం చేస్తానా అని ప్రశ్నించారు. ఎస్పీ సురేశ్‌కుమార్‌పై ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్పీ తో పాటు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్‌నగర్ టౌన్ సీఐ స్వామిలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.