
- కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ను 32 కబ్జా కేసులు ఉన్న వ్యక్తికి ఇచ్చారని, ఆ పార్టీ అభ్యర్థి ఓటేస్తే మన భూములన్నీ కబ్జా పెడుతాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆలోచించి ఓటు వేయాలని, ఆగమాగం కావొద్దని ఓటర్లకు సూచించారు. మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ తో కలిపి బుధవారం 6, 7,30 డివిజన్ పరిధిలోని యజ్ఞవరహాస్వామి టెంపుల్
మారుతీ నగర్ చౌరస్తా, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కరీంనగర్ లో చక్కటి రోడ్లు వేసుకున్నామని, లైటింగ్స్ తో సిటీ జిగేల్ మంటోందన్నారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఇస్కాన్, టీటీడీ టెంపుల్, ఐటీ టవర్ జిల్లాకే తలమానికం కానున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే కేసీఆర్ గెలవాలని ఆకాంక్షించారు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి, రైతుబంధు ఎత్తేస్తామంటున్నారని,3 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నారని
ఇదే జరిగితే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎంపీగా గెలిచాక నాలుగున్నరేళ్లు కనిపించకుండా పోయాడని, కరీంనగర్ కు ఒక్క రూపాయి తేకుండా ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చాడని విమర్శించారు.