ఖర్చు ఎంతైనా రెడీనా..! ఆశావహులకు తేల్చిచెబుతున్న పార్టీల అధిష్టానాలు

ఖర్చు ఎంతైనా రెడీనా..! ఆశావహులకు తేల్చిచెబుతున్న పార్టీల అధిష్టానాలు
  • సిటీలో ఒక్కో అభ్యర్థికి రూ. పదుల కోట్లలో..   
  • అంత ఉంటేనే టికెట్లు ఇస్తామంటున్న పార్టీల పెద్దలు 
  • గెలుపుకోసం ఎంతవరకైనా సిద్ధమేనంటున్న ఆశావహులు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ​బీజేపీలో పోటాపోటీగా నేతలు

హైదరాబాద్, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. గ్రేటర్ సిటీలో చాలా ఖరీదు కానున్నాయి. రాజకీయ పార్టీలు కూడా అందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, ఎన్నికల ఖర్చులపై నిమగ్నమయ్యాయి. వచ్చే ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి గెలవకపోతే రాజకీయ భవిష్యత్​ ఉండదనే ఆందోళన ఆయా పార్టీల నేతల్లో ఉంది. కొందరు టికెట్ దక్కితే చాలు.. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా చేసి సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇదే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనుంది. ఇక బీఆర్ఎస్​ సిట్టింగ్​లకే సీట్లు కేటాయించగా..  కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. 

పరిస్థితుల దృష్ట్యా.. 

బీఆర్ఎస్ అభ్యర్థికి కనీసం రూ. 30 కోట్లు టార్గెట్​గా పెట్టినట్టు, ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉంటే మరో రూ. 10 కోట్లు అదనంగా ఖర్చు చేయాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే క్యాండిడేట్లు రెడీగా ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్​, బీజేపీ నుంచి కూడా అంతే ఖర్చు చేస్తేనే టికెట్లు ఆశించండి.. అని ఆయా పార్టీల అధిష్టానాలు స్పష్టం చేసినట్లు టాక్. ముఖ్యంగా మల్కాజిగిరి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్, ఉప్పల్, సనత్​నగర్, ఖైరతాబాద్ ​స్థానాల్లో స్థానిక రాజకీయ పరిస్థితులు దృష్ట్యా భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆయా పార్టీల హైకమాండ్​ల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. 

Also Read : సూర్యాపేటలోనే ఐటీ జాబ్.. అక్టోబర్ 2న ప్రారంభం

ఇక ఓల్డ్ సిటీలోని చార్మినార్, యాకత్​పురా, బహదూర్​పురా, నాంపల్లి, మలక్​పేట, గోషామహల్​ సెగ్మెంట్లలో మజ్లిస్​తో పోటీపడలేమని ఆయా స్థానాల్లో ఆశావహులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. ముషీరాబాద్, అంబర్​పేట,జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ​స్థానాల్లో  రూ. 20 నుంచి రూ. 25 కోట్ల మేర ఖర్చు పెట్టాలని టికెట్లను ఆశిస్తున్న నేతలకు పార్టీల అధిష్టాన పెద్దలు సూచించినట్టు క్యాడర్ చర్చించుకుంటున్నారు. 

భవిష్యత్​ను డిసైడ్ చేస్తాయంటూ..

 ఈసారి ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్​ను డిసైడ్ చేస్తాయని పలువురు బీఆర్ఎస్​అభ్యర్థులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు కూడా ఇదే అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ఆదేశాల మేరకు పలువురు అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. వినాయక నవరాత్రులను రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేలే మండపాలను ఏర్పాటు చేయించారు. అవసరమైన ఖర్చులకు కూడా నిర్వాహకులకు అందించారు. 

మరికొన్ని చోట్ల ప్రతి మండపానికి  రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ​క్యాండిడేట్లు అప్పుడే ఎన్నికల ప్రచార ఆర్భాటం ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. రాబోయే దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి పండుగల సందర్భంగా కూడా గులాబీ పార్టీ నేతలు భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నాయి. ఆ పార్టీల క్యాండిడేట్లు కూడా పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు రెడీ అయ్యే పనిలో ఉన్నారు. 

 అంచనాలు వేసుకుంటున్న నేతలు

టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్న ఆయా పార్టీల నేతలంతా ఇప్పటి నుంచే ఖర్చులపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రచారానికి ఎంత ఖర్చు చేయాలి. కార్యకర్తలకు ఎంతెంత ఇవ్వాలి. ఓటర్లకు ఎంత పంపిణీ చేయాలి.. ఇలా పలు అంశాలపై సమాలోచనలు చేసుకుంటున్నారు. అధిష్టానాలు ఇచ్చే టార్గెట్ మేరకు .. ఖర్చు ఎంతైనా పర్వాలేదని, గెలుపు ముఖ్యమని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయం వరిస్తే ఎన్నికల్లో పెట్టిన ఖర్చును అధికారంలోకి వచ్చాక సంపాదించుకోవచ్చనే ఆశలో మునిగిపోయారు. మొత్తానికి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు  గ్రేటర్​హైదరాబాద్​లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు చాలా ఖరీదు కానున్నాయి.