ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్​ క్లోజ్!

ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్​ క్లోజ్!
  • హైదరాబాద్​కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​
  • మౌనంగా ముఖ్య నేతలు.. కాంగ్రెస్​లోకి వలసలు
  • ఏపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్​
  • ఇప్పుడు సీన్​ రివర్స్.. ప్యాకప్​ పరిస్థితి

హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్​లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్​ దాదాపు క్లోజ్​అయింది. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇందులో పలువురు  కాంగ్రెస్​ కండువా కప్పుకొని ఏపీలో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్​కార్యకలాపాలు ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్​ అయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ ​అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు.

వారం రోజుల కింద విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాతన్నా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా లేక ఆయన కూడా వేరే పార్టీలో చేరుతారా? అనే చర్చ ఏపీ పొలిటికల్​ సర్కిల్స్​లో సాగుతున్నది. మాజీ మంత్రి రావెల కిశోర్​బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాల నుంచి నిరుడు జనవరి 2న పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. కేసీఆర్​ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సిట్టింగ్​ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్​లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్​ప్రకటించారు. కానీ, ఏడాది తిరగకముందే సీన్​రివర్స్​అయింది. సిట్టింగ్​ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరడం కాదు కదా ఏపీ బీఆర్ఎస్​నేతలే కాంగ్రెస్​తో పాటు ఇతర పార్టీలతో టచ్​లోకి వెళ్లారు.

హడావుడి చేసి సైలెంట్​!

పార్టీని ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా నిరుడు జనవరి 18న ఖమ్మంలో బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభను కేసీఆర్​ నిర్వహించారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్​సీఎంలు పినరయి విజయన్, అర్వింద్​కేజ్రీవాల్​, భగవంత్​సింగ్​మాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా సహా వివిధ పార్టీల నేతలు, ఏపీ బీఆర్ఎస్​నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో తాము గెలిచి ఢిల్లీకి పోతామని, ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్​ చెప్పారు. ఆ సభ తర్వాత ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, తిరుపతిలో బీఆర్ఎస్​బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. వైజాగ్​స్టీల్​ప్లాంట్​ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏపీ బీఆర్ఎస్​నేతలు పాల్గొన్నారు. గుంటూరులో ఏపీ బీఆర్ఎస్​అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​పార్టీ ఆఫీస్​ప్రారంభించారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలకు స్పెషల్​ఫ్లయిట్లు వేసుకొని వెళ్లిన కేసీఆర్.. గుంటూరులో పార్టీ ఆఫీస్​ప్రారంభోత్సవానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్​ మహారాష్ట్ర పాలిటిక్స్​పైనే దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్ఎస్​యాక్టివిటీ తగ్గిపోయింది. నిరుడు ఆగస్టు నుంచి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉండటంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఏపీలో బీఆర్​ఎస్​కు ముఖ్య నేతలుగా ఉన్న తోట చంద్రశేఖర్, రావెల కిశోర్​బాబు, చింతల పార్థసారథి సైలెంట్​అయ్యారు. వారు మౌనంగా ఉండటంతో వారి వెంట బీఆర్ఎస్​లో చేరిన వాళ్లంతా కొన్ని రోజులుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్​లో చేరారు. ఏపీ సీఎం జగన్​ గురువారం హైదరాబాద్​కు వచ్చి బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్​ను పరామర్శించారు. కేసీఆర్​తో జగన్​40 నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. జగన్​పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా ఏపీ బీఆర్ఎస్​నేతలకు అందలేదు.  ఏపీలో అసలు బీఆర్​ఎస్​ పార్టీ ఉండే పరిస్థితే కనిపించడం లేదని భావించి  నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.