
- గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ పేరిట వెలుస్తున్న విల్లాలు
- సర్వే నంబర్‌ను మెన్షన్ చేయకుండానే
- పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండీఏ
- ఎన్జీటీలో కేసు ఫైల్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
- హెచ్ఎండీఏ, సంగారెడ్డి కలెక్టర్‌కు ఎన్జీటీ నోటీసులు
- నిర్మాణాలు ఆపకపోతే కూల్చేస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: చెరువులోకి నీళ్లొచ్చే, పోయే దారులను మూసేసి.. మట్టితో చదును చేసి.. అందులో వెంచర్ వేశారు. పెద్ద పెద్ద విల్లాలను కట్టేస్తున్నారు. సర్వే నెంబర్ మెన్షన్ చేయకుండానే హెచ్ఎండీఏ పర్మిషన్ కూడా ఇచ్చేసింది. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేసు ఫైల్ చేసింది. ఆ కేసుకు సంబంధించి హెచ్ఎండీఏకు, సంగారెడ్డి కలెక్టర్‌కు మూడ్రోజుల కింద ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవహారం బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారు బొల్లారంలోని వర్రకుంట చెరువుపై మియాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న సంస్థ చేపడ్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఇది.
చెరువులో వెంచర్!
మియాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రమోటర్, డైరెక్టర్‌గా ఉన్న గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు జిన్నారం మండలం బొల్లారంలోని సర్వే నెంబర్ 82, 83ల్లో ఉన్న చెరువులో వెంచర్ వేసినట్టు ఆరోపిస్తూ ఆ మధ్య హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. సర్వే నెంబర్లను మెన్షన్ చేయకుండానే అక్కడ హౌసింగ్ లే అవుట్‌కు అనుమతిచ్చినట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించి ఫొటోలను కూడా ఆ సంస్థ ఎన్జీటీలో ప్రొడ్యూస్ చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన ఎన్జీటీ సదరన్ బెంచ్.. హెచ్ఎండీఏ, సంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు పంపింది. వెంటనే ఆ వెంచర్ వద్ద సర్వే చేయించాలని ఆదేశించింది.
అంతేకాదు.. పర్యావరణ, అటవీశాఖలకు చెందిన ఇంటిగ్రేటెడ్ రీజినల్ ఆఫీసు అధికారులూ స్వతంత్ర దర్యాప్తు చేసి ఆగస్టు 4 కల్లా రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశాలిచ్చింది. హౌసింగ్ లే అవుట్‌కు ఇచ్చిన పర్మిషనుపై మరోసారి హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించుకోవాల్సిందిగా సూచించింది. చెరువును ఆక్రమించి విల్లా వెంచర్‌ను నిర్మించడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువును పూడ్చేసి నిర్మాణాలు చేపట్టడమేంటని మండిపడింది. పిటిషనర్ సమర్పించిన ఫొటోలను బట్టి చూస్తే.. ఆ చెరువు నామరూపాల్లేకుండా పోయిందని పేర్కొంది. చెరువుకు సంబంధించిన ఇన్లెట్, అవుట్లెట్ చానెళ్లను పూర్తిగా మాయం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీళ్లు వచ్చే, పోయే దారి లేకుండా చేశారని, హెచ్ఎండీఏ కూడా ఆ విల్లాలకు అధికారికంగా పర్మిషన్లను ఇచ్చేసిందని ఎన్జీటీ ఫైర్ అయింది. ఆ నిర్మాణాలను వెంటనే ఆపేయాలని, లేదంటే వాటిని కూల్చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇరిగేషన్ శాఖ కట్టొద్దన్నా..
వర్రకుంట చెరువు ఆక్రమణకు గురి కావడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గతంలో అక్కడ తనిఖీలు చేసింది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కడుతున్న నిర్మాణాలన్నింటినీ ఆపేయాలంటూ అప్పుడే నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికను గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థకు కూడా పంపించినట్టు తెలుస్తున్నది. అయితే, కార్పొరేటర్ శ్రీకాంత్ సహా సంస్థ ప్రమోటర్లు.. తామేమీ చెరువును పూడ్చలేదని చెప్తున్నారు. తాము వెంచర్లు నిర్మిస్తున్న సర్వే నంబర్లలో చెరువు లేనే లేదంటున్నారు. సర్వే నంబర్లు 81, 83, 84లోనే చెరువు ఉన్నదని, తాము సర్వే నెంబర్ 82లోని ఏడున్నర ఎకరాల్లో మాత్రమే వెంచర్ నిర్మిస్తున్నామని అంటున్నారు. కోర్టుల్లోనే తేల్చుకుంటామని, లీగల్ ఫైట్ చేస్తామని చెప్తున్నారు. హెచ్ఎండీఏ పర్మిషన్ లెటర్లో సర్వే నెంబర్ లేకపోవడం టెక్నికల్ ఎర్రర్ అని పేర్కొన్నారు.