హైదరాబాద్: కవిత కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరును ప్రకటించిన కవిత.. పార్టీ ఆవిర్భావ సభలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్, తన తండ్రి కేసీఆర్ టార్గెట్గా కవిత విమర్శల వర్షం కురిపించారు. దీంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో కవిత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కోల్గేట్, బిస్లరీల ఒరిజినల్, నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కవిత తమ పార్టీ పేరు కాపీ కొట్టిందని అర్థం వచ్చేలా సెటైరికల్ పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్.
ఏంటీ ఒరిజినల్, ఫేక్ వివాదం:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, కవిత తండ్రి కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్లు ఈ పార్టీ పేరుతో కేసీఆర్ రాజకీయం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే లక్ష్యంగా 2022, అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ మార్చారు కేసీఆర్. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ఓటమి పాలైంది.
ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆ పార్టీ చరిత్రల్లోనే అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ ఇలా ఏ ఎన్నికల్లో పోటీ చేసిన కూడా ఆ పార్టీ చతికిలపడుతూనే ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడం ద్వారా చాలా నష్టం జరిగిందని ఒప్పుకున్నారు. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
►ALSO READ | దమ్ముంటే ఆ ఐదు గ్రామాలను తిరిగి తీసుకురావాలి: బీజేపీ నేతలకు కవిత సవాల్
ఇంతలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండైన జాగృతి అధ్యక్షురాలు కవిత తన తండ్రి పార్టీ మాదిరిగానే టీఆర్ఎస్ అర్థం వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి తండ్రి కేసీఆర్కు ఊహించని షాక్ ఇచ్చారు. కవిత నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ ఇరాకాటంలో పడిపోయింది. కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్గా ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మారిస్తే తండ్రి కూతుర్ల పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే కవిత కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

