
- కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల వినతి
మెదక్ టౌన్, వెలుగు: ఘనపూర్ ఆనకట్ట కింద పంటల సాగు కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లో నీరు విడుదల చేయకుంటే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల రైతులతో మెదక్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తుందని దుయ్యబట్టారు. సింగూరులో నీళ్లు ఉన్నపటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు వాటా కింద రావాల్సిన 0.4 టీఎంసీలు విడుదల చేయకుండా రైతులను గోస పెట్టడం దారుణమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం హాయాంలో సమయానికి నీళ్లు విడిపించామని గుర్తు చేశారు. ఘనపూర్ ఆనకట్టకు సింగూరు జలాలతో పాటు, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రొటోకాల్పాటించండి
నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి, చేగుంట, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలాలలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలను కాదని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందని పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా రెడ్డి, సుభాష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఇన్చార్జిలు, నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించండం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రొటోకాల్ విషయంలో సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య. పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు, కో-కన్వీనర్ కృష్ణ గౌడ్, లింగారెడ్డి. జుబేర్, జీవన్ రావు పాల్గొన్నారు.