
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాఫియా డాన్‌లు మంత్రులు అయ్యారని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
ఉత్తమ్, రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడ్తాయన్నారు. సెక్రటేరియెట్‌లో ప్రభుత్వపరంగా జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌ల్లో జరుగుతున్నాయని ఆరోపించారు. రోహిన్ రెడ్డి, సుమంత్ గన్‌లు పెట్టి బెదిరిస్తున్నారని, అసలు వారి దగ్గరకు తుపాకులు ఎలా వచ్చాయని నిలదీశారు. కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయట పడ్డాయని, మాఫియా డాన్‌ల చేతికి రాష్ట్రం వెళ్లిందా అని ప్రశ్నించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గన్ కల్చర్, మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.