
- ధరణిని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు
- నాటి మంత్రులు, లీడర్ల అనుచరుల పేర్ల మీదికి వందల ఎకరాలు
- గచ్చిబౌలి ఏరియాలోనే రూ. 57 వేల కోట్ల విలువైన ల్యాండ్స్‌కు ఎసరు
- నాకింత.. నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడీ
- కేసులున్న భూములనూ వదల్లే.. దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు
- నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడీ
- రిటైర్డ్ ఐఏఎస్‌ల టీమ్ ఎంక్వైరీలో వెలుగుచూసిన నివ్వెరపోయే నిజాలు
- విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు. ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కారు ల్యాండ్స్‌ను అప్పనంగా తమ పేర్ల మీదికి, తమ అనుచరుల పేర్ల మీదికి, తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదికి బదలాయించుకున్నారు. కోర్టు కేసులు నడుస్తున్న భూములను, భూదాన్ భూములను కూడా వదల్లేదు. ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే రూ. 57వేల కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ లీడర్లు పొతం పెట్టారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల
ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి.. తమ ఖాతాల్లో వేసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌ల టీమ్ ఎంక్వైరీలో ఈ నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి. భూదందాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది. ఈ తతంగాన్నంతా కొందరు కలెక్టర్లు, ఉన్నతాధికారులు దగ్గరుండి నడిపించినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్‌ల టీమ్ రిపోర్టు అందజేయగా.. విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసలు గుట్టు విప్పేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా జిల్లాల్లోనూ జరిగిన భూ కుంభకోణాలను తేల్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
ధరణి పోర్టల్‌లోని లోపాలను అడ్డంపెట్టుకొని కేసీఆర్ సర్కార్ భూదందాలకు పాల్పడుతున్నదని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి.. ఇదే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, హెచ్ఎండీఏ విభాగాల రివ్యూల్లో భూలావాదేవీలపై నివేదికలు అడిగారు. ఆయా శాఖలు అందజేసిన వివరాలను స్టడీ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, కొందరు రెవెన్యూ సిబ్బందితో కూడిన ఈ టీమ్.. ప్రభుత్వ శాఖలు అందజేసిన వివరాలను బట్టి ఎంక్వైరీ చేసింది. రూ. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల బదలాయింపు జరిగినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎమ్మార్వోలు, సర్వే అధికారులు, ఇతర సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేల్చింది. ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ మౌఖిక ఆదేశాల మేరకు వీళ్లు ఆయా వ్యక్తులు, సంస్థలకు అనుకూలంగా వ్యవహరించి భూహక్కులు కట్టబెట్టినట్లు వెల్లడైంది.
నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్న హైదరాబాద్ సిటీ వెస్ట్ ప్రాంతంలోని గ్రామాల పరిధిలో భారీ భూబాగోతం నడిచినట్లు తేలింది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, గోపన్ పల్లి, గండిపేట, మహేశ్వరం, శంకర్ పల్లి మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రైవేట్ వ్యక్తులకు కొందరు అధికారులు బదలాయించినట్లు బయటపడింది. ఈ తతంగాన్ని 2022 జూన్, జులై నుంచి నవంబర్, డిసెంబర్ వరకు ముగించారు. ఈ ప్రాంతంలోని భూములు ఎకరా రూ.30 కోట్ల నుంచి 50 కోట్లు పలుకుతున్నాయి. ఒక్కో సర్వే నెంబర్లో రూ. 200 కోట్ల నుంచి 5,500 కోట్ల విలువైన భూముల బదలాయింపు జరిగినట్లు తేలింది.
ఒకే గ్రామంలో రూ.30 వేల కోట్ల భూమి..!
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 36, 37లో గల 600 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ సంస్థలకు నాటి సర్కార్ కట్టబెట్టింది. ఇందులో కొందరి పేర్ల మీద పట్టాలు కూడా చేసేసింది. ఇక్కడ ఎకరా రూ.50 కోట్లు పలు కుతుంది. ఈ లెక్కన ఈ ఒక్క గ్రామంలోనే రూ. 30 వేల కోట్ల విలువ చేసే భూముల గోల్మాల్ జరిగినట్లు తేలింది.
హైదరాబాద్ చుట్టూ ఇదీ దందా..!
హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెం. 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్ల వరకు పలుకుతున్నది) భూమి శేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్‌గా చూపిస్తుండగా.. పట్టా ల్యాండ్‌గా కన్వర్ట్ చేశారు.
ఇదే మండలం గోపన్‌పల్లి సర్వే నంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా.. 124/10, 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను (ఎకరా రూ.40 కోట్లు) పట్టాగా మార్చేశారు.
శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెం. 186, 187 లోని 20 ఎకరాల (ఎకరా రూ. 20 కోట్లు) భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు.
గండిపేట్ మండలం ఖానాపూర్లోని బిలా దాఖల భూములకు సర్వే నంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్‌కు పట్టా చేశారు.
మియాపూర్‌లోని సర్వే నెం. 69లో గల 27 ఎకరాల భూమి (ఎకరా రూ. 50 కోట్లు), గచ్చిబౌలిలోని సర్వే నెం. 38 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ ప్లస్ భూమిని (ఎకరా రూ. 50 కోట్లు) ఐదు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని (ఎకరా రూ. 3 కోట్లు) నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు.
శేరిలింగంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు (ఎకరా రూ. 50 కోట్లు), మాదాపూర్ లోని సర్వే నంబర్ 68, 64లో గల ఐదెకరాలు (ఎకరా రూ. 60 కోట్లు), హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 80, కొండాపూర్‌లోని సర్వే నంబర్ 87, 88లో గల 10 ఎకరాల (ఎకరా రూ. 50 కోట్లు) భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిల, కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్‌కు కొత్తగా 555 సర్వే నంబర్‌ను క్రియేట్ చేసి 150 ఎకరాలు (ఎకరా రూ. 30 కోట్లు) కూడా ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.