లిక్కర్ సేల్స్ డబుల్ చెయ్యాలె.. రోజుకు రూ.180 కోట్లు దాటేలా ప్లాన్లు

లిక్కర్ సేల్స్  డబుల్ చెయ్యాలె.. రోజుకు రూ.180 కోట్లు దాటేలా ప్లాన్లు
  • వైన్స్ ఓనర్లతో భారీగా మద్యం కొనిపించే పనిలో ఆఫీసర్లు     
  • స్టాక్​ ఎక్కువ తీసుకోవాలంటూ ప్రెజర్  
  • ఎన్నికల షెడ్యూల్ వస్తుందని.. ఆఫర్లు ఇస్తామంటూ ఒత్తిడి  
  • సేల్స్ రోజుకు రూ.180 కోట్లు దాటేలా ప్లాన్లు 
  • స్కీంలకు నిధుల సర్దుబాటు కోసమే తంటాలు  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యేలా చూడాలని, ఆదాయాన్ని భారీగా పెంచాలని ఎక్సైజ్ శాఖపై సర్కారు ప్రెజర్ పెంచుతోంది. ‘‘ఏం చేస్తారో తెలియదు.. మద్యం అమ్మకాలు మరింత పెరగాలి” అని స్టాఫ్, ఫీల్డ్ లెవల్ లోని ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తోంది. సేల్స్ సాధారణ రోజుల కంటే డబుల్ కావాల్సిందేనంటూ అల్టిమేటం ఇచ్చింది. సేల్స్ పెంచడం కోసం వైన్స్ ఓనర్లపైనా రకరకాలుగా ప్రెజర్ పెంచుతోంది. తప్పదు అనుకుంటే స్పెషల్ ఆఫర్లు సైతం ప్రకటిస్తోంది. మొన్నటికి మొన్న స్కీంలకు ఆదాయం సరిపోవడం లేదని ఎలక్షన్ షెడ్యూల్ పేరుతో పెద్ద ఎత్తున మద్యాన్ని లిఫ్ట్ చేయించేలా వాట్సాప్​ మెసేజ్​లతో ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చారు.  

ఇప్పుడేమో ఇంకో స్పెషల్ ఆఫర్​ ప్రకటించారు. రోజూ అయ్యే బిల్లింగ్ లో 50 శాతం స్టాక్ ను అదనంగా చెక్కులు తీసుకుని ఇస్తామని చెప్తున్నారు. అంటే.. ఒక వైన్స్ నిర్వాహకుడు రూ.10 లక్షల స్టాక్ లిఫ్ట్ చేస్తే.. అదనంగా ఇంకో రూ.5 లక్షల స్టాక్ ను చెక్కులు తీసుకుని ఇచ్చేందుకూ సర్కారు అనుమతించింది. మరోవైపు స్టాక్ తక్కువ కొనుగోలు చేస్తున్న వైన్స్ లపై ఎక్కువ స్టాక్ తీసుకోవాలంటూ కిందిస్థాయి ఆఫీసర్లు ప్రెజర్ తీసుకొస్తున్నారు. యావరేజ్​గా రోజూ రూ. 100 కోట్లు, కొన్నిసార్లు ఆపైన సేల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు రోజువారీగా యావరేజ్ సేల్స్ రూ. 180 కోట్లు దాటేలా ప్లాన్లు వేస్తున్నారు. ఇదంతా అటు తిరిగి, ఇటు తిరిగి జనాలను లిక్కర్​కు మరింత బానిసలుగా మార్చేలా అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.  

8 నెలల్లో రూ. 1000 కోట్లు ఎక్కువొచ్చింది 

రాష్ట్రంలో 2,620 వైన్స్ లతోపాటు బార్లు, క్లబ్‌‌లు, పబ్‌‌లు ఉన్నాయి. వీటికి ఆయా జిల్లాల్లో ఉన్న మద్యం డిపోల నుంచి సరుకు సరఫరా అవుతుంది. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల కోట్లు మాత్రమే సేల్స్ జరిగాయి. అది ఈసారి రూ.1000 కోట్లకుపైనే పెరిగింది. రానున్న రోజుల్లో దీనిని మరింతగా పెంచాలని సర్కారు చూస్తోంది.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.23,426 కోట్ల సేల్స్ జరిగాయి. 

ఇందులో 22.87 లక్షల లిక్కర్ కేస్​లు, 36.85 లక్షల బీర్ కేస్​లు ఉన్నాయి. అయితే, ఆదాయం పెరుగతున్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. దీంతో ఆదాయం దెబ్బతింటుందని భావించిన ప్రభుత్వం సేల్స్​ను స్పీడప్ చేసే పని పెట్టుకున్నది. టార్గెట్లు పెట్టి మరీ అమ్మిపిస్తున్నది. ఈ ఆగస్టు నెలలో ఇప్పటి దాకా రూ.2,100 కోట్ల లిక్కర్‌‌ అమ్ముడైంది. ఇందులో 22 లక్షల కార్టన్ల ఐఎంఎల్‌‌, 38 లక్షల కార్టన్ల బీర్లు ఉన్నాయి. బుధ, గురువారాల్లో కనీసం రూ.400 కోట్ల మేర మద్యాన్ని లిఫ్ట్ చేయించేందుకు సర్కారు ప్లాన్ చేసింది.   

ఎలక్షన్ షెడ్యూల్ పేరుతో హడావుడి  

నాలుగు రోజుల కిందట వైన్స్, బార్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్​లలో ప్రత్యేకంగా ఒక మెసేజ్ ను ఎక్సైజ్ అధికారులు సర్య్కులేట్ చేయించారు. ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుందంటూ లిక్కర్ సేల్స్ పెంచేందుకు ఎత్తుగడ వేశారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి మూడో వారంలోపు షెడ్యూల్ వస్తుందని అందులో పేర్కొన్నారు. అప్పుడు అనుకున్నంత మద్యాన్ని లిప్ట్ చేసే అవకాశం లేదని, పరిమితులు ఉంటాయని మెసేజ్ లో తెలిపారు. వైన్స్, బార్ల నిర్వాహకులు ఇప్పుడే పెద్ద మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకోవాలని సూచించారు. 

దీని ఫలితంగా గత మూడు రోజుల్లోనే రూ.444 కోట్ల విలువైన లిక్కర్, బీర్లు మద్యం డిపోల నుంచి వైన్స్​లకు చేరాయి. ఈ నెల 26న  రూ.108.16 కోట్లు, 28న రూ.176.47 కోట్లు, 29న రూ. 158 కోట్ల మద్యం లిఫ్ట్ అయింది. నిజానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ముగిసిన తర్వాతే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. దానికి వచ్చే అక్టోబర్ 4 వరకు టైం ఉంది. దీనిపై కొందరు వైన్స్ ఓనర్లు ఆరా తీయడంతో.. సర్కారు నుంచి ఒత్తిడి కారణంగానే సేల్స్ పెంచేందుకు ఎక్సైజ్ అధికారులు ఇలా మెసేజ్ లు పెట్టినట్లు తేలింది. 50 శాతం అదనంగా స్టాక్ ఆఫర్ కూడా ఇందులో భాగమేనని, రానున్న రోజుల్లో మరిన్ని ఆఫర్లు ప్రకటిస్తారని అంటున్నారు.  

ప్రెజర్ పెంచుతున్నరు

నిజానికి ఈ ఆగస్టులో సేల్స్ కొంత తగ్గాయి. కానీ వైన్స్​లకు అప్లికేషన్లు, టెండర్ల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువే ఖజనాకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉండగా.. 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.2,629 కోట్ల ఆదాయం వచ్చింది. దీనికి తోడు టెండర్ దక్కించుకున్నోళ్లతో ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్ ఫీజు కట్టించుకున్న దానితో ఇంకో రూ.300 కోట్లు వచ్చింది. 

మొత్తంగా రూ.3 వేల కోట్లు సమకూరింది. దీనితో ప్రభుత్వం ఏ మాత్రం సంతృప్తి చెందడంలేదు. గతేడాది కంటే ఇప్పుడు డబుల్ అమ్మకాలు జరగాలని కిందిస్థాయి అధికారులకు ఉన్నతాధికారు లు ఆదేశాలిస్తున్నారు. అంతకంటే తక్కువగా అమ్మితే ఇక వేధింపులు తప్పవు. వివిధ కారణాలు చెబుతూ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫుల్లుగా తాగించాలని, సేల్స్‌‌ పెంచాలని వైన్స్‌‌, బార్ల యజమానులపై కిందిస్థాయి ఆఫీసర్లు కూడా ఒత్తిడి పెంచారు. మద్యం ఎక్కువగా అమ్ముడుపోవడానికి బెల్ట్‌‌ షాపులను కూడా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.