
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 అక్టోబర్ 5న సింగరేణిలో కార్మిక సంఘాలకు 6వ విడత ఎన్నికలు జరిగాయి. టీబీజీకేఎస్ అధికార టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకొని.. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియను వెంటనే పునరుద్ధరించి నియామకాలు జరిపిస్తామని వాగ్దానాలు చేసి రెండోసారి ఎన్నికల్లో గెలిచింది. తిరిగి ఎన్నికలు 2019 లో జరగాల్సి ఉంది. కానీ గుర్తింపు సంఘం ఆమోద పత్రం 6 నెలలు ఆలస్యంగా 2018 ఏప్రిల్ లో ఇచ్చారని.. అప్పటినుంచి మాత్రమే రెండేళ్ల కాల పరిమితి లెక్కించాలని గుర్తింపు కార్మిక సంఘం పట్టుబట్టింది. అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. తగ్గాక కూడా సింగరేణి ఎన్నికలు నిర్వహించలేదు. 1998, 2001 ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) విజయం సాధించింది. 2003లో జరిగిన 3వసారి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలిచి నాలుగేళ్ల పాటు కొనసాగింది. 2007లో 4వసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ తిరిగి 3వ సారి విజయం సాధించింది. 2012లో తెలంగాణవాదం ఎక్కువగా ఉండటం సింగరేణి కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేపథ్యంలో 5వ సారి జరిగిన ఎన్నికల్లో టీబీజీ కేఎస్ విజయం సాధించి నాలుగేళ్లు సాగింది. తిరిగి ఆరోసారి 2017 లో గెలిచిన టీజీబీకేఎస్ కరోనా పేరుతో కొంతకాలం, ఆ తర్వాత కూడా ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నది.
కావాలనే కాలయాపన
తెలంగాణ సాధించుకున్న తర్వాత 20 వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం లేదా రిటైర్ కావడం జరిగింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. కాంట్రాక్టు కార్మికులు10 వేల నుంచి 33 వేలకు చేరుకున్నారు. సింగరేణి ఆరు జిల్లాల్లో 11 ఏరియాల వారీగా విస్తరించి ఉంది. 2018 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో బాగా లబ్ధి పొందింది. తిరిగి ఎన్నికలు జరిపితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై బీఆర్ఎస్ సర్కార్ ఆచతూచి వ్యవహరిస్తున్నది. టీబీజీకేఎస్ యూనియన్ పనితీరుపై అధికార పార్టీ చేపట్టిన ఇంటర్నల్ సర్వేలో యూనియన్ పట్ల కార్మికుల్లో అసంతృప్తి ఉన్నట్లు తేలడంతో సర్కార్ ఇన్నాళ్లుగా ఎన్నికలపై నాన్చుడు ధోరణి అనుసరిస్తూ వస్తున్నది. సర్కార్ కనుసన్నల్లో ఉంటున్న సింగరేణి యాజమాన్యం సైతం ఎన్నికల నిర్వహణ వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుతుందంటూ సాకు చూపుతూ వచ్చింది. సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టాయి. కార్మిక సంఘాల ఒత్తిడితో కేంద్ర కార్మిక శాఖ రంగంలోకి దిగి అన్ని యూనియన్ల సభ్యత్వాలతో పాటు ఎన్నికల ముందు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించింది. సింగరేణి ఎండీ శ్రీధర్ 2022 జూన్ 8న రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లెటర్ రాశారు. రాష్ట్ర సర్కార్ మాత్రం ఎన్నికలను వాయిదా వేయించాలనే పరిస్థితులను వెతుకుతున్నది. సింగరేణి మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నది.
టీబీజీకేఎస్ పై పెరుగుతున్న వ్యతిరేకత
2017లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. కారుణ్య నియామకాల ప్రక్రియను యాజమాన్యంతో కలిసి కొన్ని షరతులతో పునరుద్ధరించినప్పటికీ.. కార్మికుల్లో ఆ సంఘం పట్ల తీవ్ర వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. రాష్ట్ర నాయకులను అడ్డుపెట్టుకొని టీబీజీకేస్ నాయకులు కార్మికులను అడ్డగోలుగా దోచుకున్నారని, ఏ చిన్న సమస్య చెప్పుకున్నా డబ్బుతోనే ముడిపెట్టే వారని కార్మికులు వాపోతున్నారు. అధికార పార్టీ అండదండలతో యజమాన్యాన్ని సైతం భయభ్రాంతులను చేసి మాట వినని అధికారులపై వేటు వేయిస్తున్నారని, కారుణ్య నియామకాల పేరిట ఎన్నో కోట్లు కూడగట్టుకున్నారని టీబీజీకేస్ నేతలపై ఆరోపణలు ఉన్నాయి. యజమాన్యంలోని అధికారులు కూడా ఆ నాయకుల గుప్పెట్లోనే ఉన్నారని కార్మికుల్లో ఆవేదన ఉంది. 2019లో నిర్వహించవల్సిన ఎన్నికలు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం అధికార పార్టీ సంఘానికి తలవొగ్గి ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపుతూ వాయిదాలు వేస్తూ వస్తున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెల అనుకూల వాతావరణం ఉంటుందని ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు, జేఏసీగా డిమాండ్ చేస్తున్నాయి.
హైకోర్టు ఆదేశం
సింగరేణిలో గుర్తింపు ఎన్నికల జాప్యంపై ఏఐటీయూసీ యూనియన్ 2022 ఆగస్టు 4న హైకోర్టును ఆశ్రయించింది. మూడుసార్లు వాదనలు విన్న న్యాయస్థానం మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. అయినా సింగరేణి మేనేజ్మెంట్ ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడంతో తిరిగి కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానానికి వెళ్లాలని ఏఐటీయూసీ నిర్ణయించింది. కోర్టు ప్రమేయంతో కదలిన ఎన్నికల నిర్వహణ.. హైకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో మార్చి 13న హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలతో సెంట్రల్ డిప్యూటీ లేబర్ కమిషనర్ అధ్యక్షతన సమావేశమై సమీక్షించింది. ఈ సమావేశానికి సింగరేణి యాజమాన్యంలో రిజిస్టర్ అయి ఉన్న13 కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి సింగరేణి ఎన్నికల నిర్వహణ కోసం అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియ చేసేందుకు సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో యాజమాన్యం మార్చి, ఏప్రిల్, మే నెలలలో బొగ్గు ఉత్పత్తికి డిమాండ్ ఉంటుందని ఈ కాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపింది. కార్మిక సంఘాల ప్రతినిధులు మార్చి ఆఖరిలో ఉత్పత్తి డిమాండ్ తగ్గుతుందని వెంటనే ఎన్నికల నిర్వహణ తేదీలు ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం, కార్మిక సంఘాల వాదనలు విన్న ఆర్ఎల్సీ తిరిగి ఏప్రిల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అందులో ఎన్నికల నోటిఫికేషన్ పై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
- వి. రత్నాకర్ రావు, ఎఐటీయూసీ నాయకుడు