ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది 

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది 
  •      గోదావరి‑కావేరి లింకింగ్ సమావేశాలకు హరీశ్ హాజరయ్యారు: వెదిరె శ్రీరామ్
  •     చత్తీస్​గఢ్ వాడుకోని ఇంద్రావతి జలాలనే తమిళనాడుకు ఇస్తం
  •     ఇచ్చంపల్లి బ్యారేజీతో మేడిగడ్డకు, సమ్మక్క సాగర్​కు ఇబ్బంది లేదు
  •     ఢిల్లీలో రివర్ లింకింగ్ టాస్క్​ఫోర్స్ 19వ సమావేశం

హైదరాబాద్, వెలుగు: బచావత్ అవార్డు ప్రకారం రాష్ట్ర నీళ్ల వాటాలో నష్టం లేకుండా ఎగువ రాష్ట్రం మిగులు జలాల్లో తెలంగాణ వాటాను నిర్దేశిస్తే గోదావరి–కావేరి లింకింగ్​కు అభ్యంతరం లేదని ఐదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నదని రివర్ ​లింకింగ్ టాస్క్​ఫోర్స్​ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అన్నారు. ఇప్పటిదాకా జరిగిన మీటింగ్​లకు రాష్ట్రం తరఫున అప్పటి మంత్రి హరీశ్ రావు, నాటి అధికారులు కూడా హాజరయ్యారని, ఎన్నోసార్లు ప్రాజెక్టుకు ఓకే కూడా చెప్తూ సంతకాలూ చేశారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన రివర్​లింకింగ్ టాస్క్​ఫోర్స్ 19వ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ చత్తీస్​గఢ్ వాడుకోని 147 టీఎంసీల జలాలనే తమిళనాడుకు తరలిస్తున్నామని చెప్పారు.

ఆ నీళ్లతో తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చత్తీస్​గఢ్​కు సంబంధించినంత వరకు ఆ జలాలతో ఆ రాష్ట్రానికి ఉపయోగం లేదని, అడవులు, కొండల్లో ఉండడంతో బ్యారేజీలు, డ్యామ్​లు కట్టుకుని వాడుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల అవసరాల దృష్ట్యా తెలంగాణలో బ్యారేజీని నిర్మించి తమిళనాడుకు కేటాయిస్తున్నామన్నారు. గోదావరిలో తెలంగాణ వాటా 980 టీఎంసీలల్లో ఒక్క చుక్క కూడా ముట్టుకోవడం లేదన్నారు. చత్తీస్ గఢ్​ నుంచి వచ్చే ఇంద్రావతి నది నుంచే నీటిని తీసుకుంటామని చెప్పారు. సీతారామ, సమ్మక్కసాగర్, మేడిగడ్డ, శ్రీరాంసాగర్​తో పాటు ఇచ్చంపల్లి ప్రాజెక్టులపై గతంలో తెలంగాణ సర్కార్​తో చర్చించామన్నారు.

తెలంగాణకు నష్టం చేయం

ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీని కట్టినంత మాత్రాన తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని వెదిరె శ్రీరాం స్పష్టం చేశారు. ఇటు సమ్మక్క బ్యారేజీకిగానీ, అటు మేడిగడ్డ బ్యారేజీకిగానీ ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ప్రాజెక్టుకు పెట్టే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరిస్తుందన్నారు. పరిహారం ప్యాకేజీ కూడా కేంద్రం అందిస్తుందని చెప్పారు. దీంతో తెలంగాణకు ఖర్చు ఉండదని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీళ్లు తీసుకోవడంలో విఫలమైతే.. ఇచ్చంపల్లి నుంచి గ్రావిటీ ద్వారానే నీళ్లు తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. తెలంగాణకు భవిష్యత్​లో నష్టం చేయకుండానే నదుల అనుసంధానాన్ని చేపడతామన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుతో మేడిగడ్డకు ఎలాంటి సమస్య ఉండదని తేల్చి చెప్పారు. ముంపు ముప్పు కూడా ఉండకుండా గేట్ల ఏర్పాటు నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ముంపు ముప్పు ఉంటే సీడబ్ల్యూసీనే అసలు ఒప్పుకోదని అన్నారు.

సగం వాటా కూడా వచ్చే చాన్స్ ఉంటది..

తెలంగాణ ప్రభుత్వం వాయిస్​ను గట్టిగా వినిపిస్తే నదుల అనుసంధానంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టు నుంచి సగం వాటాను సాధించుకునే అవకాశం ఉంటుందని వెదిరె శ్రీరామ్ చెప్పారు. తెలంగాణ భూభాగంలో కడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్​ను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి వాటా ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాలను కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.