తెలంగాణ ప్రభుత్వంలో బీసీలు ఎక్కడ?

తెలంగాణ ప్రభుత్వంలో బీసీలు ఎక్కడ?

పెరిగిన జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచితే, అవకాశాలకు నోచుకోని ఎంతో మంది వ్యక్తులు అభివృద్ధి చెంది, వారు దేశ ప్రగతికి దోహదపడే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యాధికార యాత్రలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక పేద వర్గానికి చెందిన వైద్యుల జంటను కలిశాను. భార్య బీసీ(ఎ) దొమ్మరి కులం కాగా, భర్త ఎస్సీ సామాజిక వర్గం. ఆ మహిళ  పూర్వీకులు వేశ్యావృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. కానీ ఈ మహిళ బాగా చదువుకొని, భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన బీసీ రిజర్వేషన్ల ఫలితంగా,  నేడు డాక్టరై కోట్ల రూపాయల విలువ చేసే దవాఖాన నెలకొల్పి, నాణ్యమైన వైద్యం అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి వేలాదిమంది వెనక్కి నెట్టివేయబడ్డ కులాలకు చెందిన ప్రజలు రిజర్వేషన్ల ద్వారా సమాజంలో గొప్ప ప్రయోజకుల య్యారు. ఇప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీసీలు వెనుకబడేయ పడుతూనే ఉన్నారు.

ఆధిపత్య పార్టీలు బీసీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేయకుండా, కేవలం ప్రభుత్వ పథకాలకే పరిమితం చేశాయి. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో  బీసీలకు న్యాయం చేయాలని  డిమాండ్ చేస్తూ మరో పోరాటాన్ని ఆరంభించింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 1929, మే 29న సైమన్ కమీషన్ కు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. అనంతరం ఒక్క బీసీ నాయకుడు కూడా లేని  రాజ్యాంగ పరిషత్ లో  బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఒంటరిగా డిమాండ్ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులు అసలు బీసీలు అంటే ఎవరు అని సాంకేతికంగా అడ్డంకి సృష్టించగా, అంబేద్కర్ 340 అధికరణను రాజ్యాంగంలో పొందుపరిచి, బీసీలు ఎవరో ప్రభుత్వమే గుర్తించాలని పేర్కొన్నారు. అనంతరం న్యాయశాఖ మంత్రిగా బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం అప్రమత్తమై 1953 లో కాకా కాలేల్కర్ కమిషన్ వేసింది. కానీ ఆ కమిటీ సిఫార్సులను పట్టించుకోలేదు. 

బీసీ రిజర్వేషన్​ కోసం కాన్షీరామ్​ కృషి

1979లో ఏర్పాటైన మండల్ కమీషన్ చేసిన సిఫార్సులను అమలుచేయాలని, మాన్యవర్ కాన్షీరాం నిర్విరామంగా చేసిన పోరాట ఫలితంగానే వీపీ సింగ్ ప్రభుత్వం దిగి వచ్చి, 1993లో బీసీలకు కేవలం ఉద్యోగ రంగాల్లో 27శాతం రిజర్వేషన్లు అమలుచేసింది. తర్వాత 2008 నుంచి విద్యా రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబడ్డాయి. అంటే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతకర్తలైన అంబేద్కర్, కాన్షీరాంల ఉద్యమ పోరాట ఫలితంగా బీసీ రిజర్వేషన్లు వచ్చాయి. ఈ రిజర్వేషన్లను అడ్డుకోడానికి బీజేపీ, కాంగ్రెస్, ఇతర ఆధిపత్యవర్గాలకు చెందిన పార్టీలు లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశాయి. రిజర్వేషన్లు ఆధిపత్య పార్టీల భిక్ష కాదు. రాజ్యాంగబద్దంగా లభించిన హక్కు.


ఉద్యోగాల్లో, చట్టసభల్లో సమన్యాయం కోసం ఉద్యమం


ఆధిపత్య పార్టీల ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు  మేమే దయతలచి ఇచ్చినట్టుగా కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధన లేకుండానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, కేవలం ఎనిమిది శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్లు అందిస్తూ, 103వ రాజ్యాంగ సవరణ చేసింది. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా న్యాయం జరగాల్సిందే, అయితే బీసీలకు కూడా న్యాయం జరగాలి. కానీ ప్రభుత్వాలు బీసీల కులగణన కూడా చేయడంలేదు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచడం లేదు. అందుకే అంబేద్కర్, కాన్షీరాం వారసులుగా, బెహన్ కుమారి మాయవతి గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరో మహా ఉద్యమాన్ని ప్రారంభించింది. బీసీల కులగణన చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించగా అనేకమంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని బీఎస్పీ ప్రశ్నిస్తుంది. పెరిగిన జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని, ఈడబ్యుఎస్ రిజర్వేషన్లలో కూడా ఆర్టికల్ 14 సమానత్వ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యసభ, ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. 

బీసీల బిల్లును  వెంటనే   అసెంబ్లీ  ఆమోదించాలి


కేవలం బీఎస్పీ ద్వారానే 60 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారని మా పార్టీ  ప్రకటించింది. బహుజన రాజ్యంలోనే వడ్డెరలు గనులు, రోడ్లు భవనాల శాఖ పనులకు కాంట్రాక్టర్లు అవుతారని, గంగిరెద్దుల కులాల ప్రజలు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులవుతారని, చిందు,పెద్దమ్మల, వంశరాజు, పూసల వర్గాల ప్రజలు సినీ నిర్మాతలవుతారని, రజకులు హైటెక్ సిటిలో కంపెనీ ఓనర్లవుతారని, పద్మశాలీలు పత్రికలకు యజమానులవుతారని బీఎస్పీ బలంగా నమ్ముతుంది. ఇది బహుజన్ సమాజ్ పార్టీ స్వప్నం. సంపదకు, అధికారానికి అవకాశాలకు దూరంగా ఉన్న ప్రజలకు వాటిని చేరువ చేయడమే బీఎస్పీ లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీలలోని బహుజన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి బీసీలపై చిత్తశుద్ధిని చూపెట్టాలి. లేదంటే  బీసీల ఓట్లు కూడా అడిగే నైతిక అర్హత కోల్పోతారు.  


తెలంగాణ ప్రభుత్వంలో బీసీలు ఎక్కడ?

తమిళనాడు, జార్ఖండ్, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో వలే తెలంగాణ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ దేశ నిర్మాతలైనటువంటి బీసీలు 117 భారత బిలియనీర్లలో ఎంత మంది ఉన్నారు? లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల చట్ట సభల్లో బీసీల వాటా ఏది అని ప్రశ్నిస్తున్నది. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారత్ లో  ఉన్నత న్యాయస్థానాల్లో బీసీల వాటా ఎంతని నిలదీస్తున్నది. కేంద్ర, రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో బీసీల వాటా ఏది?  కాళేశ్వరం వంటి లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో బీసీ కాంట్రాక్టర్లు ఎందుకు లేరు? బీసీల ఆత్మగౌరవ భవనాలు వెలివేతకు గురై నగరం వెలుపల ఎందుకు కేటాయించబడ్డాయి?  బీసీ ఫెడరేషన్లకు బోర్డులెందుకు లేవు? ఎంబీసీ కార్పోరేషన్​కు నిధులెందుకు రావడంలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో  ఎంతమంది బీసీ అధికారులున్నారో చెప్పగలరా అని నిలదీస్తున్నది. సంపద ఉన్నచోట బీసీల ప్రాతినిధ్యం ఎందుకు లేదు?  సర్వాయిపాపన్న వంటి మహనీయులను కల్లు దుకాణాలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? కేవలం బీసీల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తే(అదీ ఆలస్యంగా) బీసీల బతుకులు మారుతాయా? అని ప్రశ్నిస్తూ, బీఎస్పీ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ, కోటి సంతకాల సేకరణ చేసి ‘ మేమెంతో మాకంత వాటా’ కావాలని నినదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బీసీలకు న్యాయం చేసేందుకు బలంగా ముందుకు సాగుతుంది. అందుకే ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచాలి లేదా గద్దెదిగిపోవాలని హెచ్చరిస్తుంది. 

 - డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన సమాజ్ పార్టీ