
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్.. ఇప్పటి వరకు 17 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఖాతా తెరువలేదు. గ్రేటర్హైదరాబాద్పరిధిలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 సీట్లలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలువలేదు. ఈసారి వాటిలో కొన్నింటినైనా దక్కించుకుని, బోణీ కొట్టాలని బీఆర్ఎస్ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్‌లోని మూడు సీట్లతో పాటు ఉమ్మడి ఖమ్మంలోని ఏడు స్థానాల్లో సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఖమ్మంలో ప్రతిపక్షాలదే హవా..
ఉమ్మడి ఖమ్మంలోని మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, వైరా సీట్లలో ఇప్పటి వరకు బీఆర్ఎస్గెలువలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాలకు గాను బీఆర్ఎస్నుంచి జలగం వెంకట్రావు (కొత్తగూడెం) ఒక్కరే గెలిచారు. పాలేరు ఉప ఎన్నికలో బీఆర్ఎస్అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వర్రావు విజయం సాధించారు. వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మదన్‌లాల్(వైరా), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), కాంగ్రెస్‌నుంచి గెలిచిన పువ్వాడ అజయ్(ఖమ్మం), కోరం కనుకయ్య (ఇల్లెందు) బీఆర్ఎస్లో చేరారు.
ఇక 2018 ఎన్నికల్లో వీళ్లందరికీ టికెట్లు ఇచ్చినా ఖమ్మం నుంచి ఒక్క పువ్వాడ అజయ్మాత్రమే బీఆర్ఎస్నుంచి గెలిచారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్రావు (కొత్తగూడెం), హరిప్రియ నాయక్(ఇల్లెందు), రేగా కాంతారావు (పినపాక), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట), సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), ఇండిపెండెంట్‌గా గెలిచిన రాములు నాయక్(వైరా) తర్వాత బీఆర్ఎస్లో చేరారు. వీరిలో రాములు నాయక్తప్ప మిగతా ఆరుగురికి మళ్లీ టికెట్ఇచ్చారు. వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను పోటీకి దించారు. ఇప్పటి వరకు ఖాతా తెరువని ఈ ఏడు స్థానాలకు గాను కనీసం నాలుగైదు చోట్ల ఈసారి ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రేటర్ లోనూ అంతే...
గ్రేటర్హైదరాబాద్పరిధిలోని గోషామహల్, ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకర్గాలతో పాటు ఫ్రెండ్లీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్‌పేట, బహదూర్‌పురా, యాకత్పురా స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఖాతా తెరువలేదు. 2018లో కాంగ్రెస్‌నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), సుధీర్‌రెడ్డి(ఎల్బీనగర్) బీఆర్ఎస్లో చేరారు. సబితను మంత్రివర్గంలోకి తీసుకోగా, సుధీర్‌రెడ్డికి మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు సీట్లలో గెలిచి తీరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు. వీటితో పాటు గోషామహల్‌లోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఆ స్థానాల్లో పోటీ నామమాత్రమేనని కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు కాసాని బీఆర్ఎస్లో చేరిన సమయంలోనూ కేసీఆర్ ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లు ఉంటే ఏడు సీట్లు ఎంఐఎం గెలుస్తుందని, వాటిని మినహాయిస్తే 112 సీట్లలో మాత్రమే పోటీ పడుతున్నామని తెలిపారు. ఈ లెక్కన ఇప్పటి వరకు బీఆర్ఎస్బోణీ కొట్టని 17 సీట్లకు గాను 10 స్థానాల్లో మాత్రమే గెలిచేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు.