పోడు భూములకు పట్టాలపై మాట మారుస్తోన్న బీఆర్ఎస్

పోడు భూములకు పట్టాలపై మాట మారుస్తోన్న బీఆర్ఎస్

భద్రాచలం, వెలుగు:  పోడు భూములకు పట్టాలిస్తామని చెప్తూ వచ్చిన బీఆర్ఎస్​ సర్కారు ఇప్పుడు మాట మారుస్తోంది. 1935 నుంచి సాగులో ఉన్నట్లు చూపాలనే నిబంధన పెట్టడం, 1950-–70 నుంచే భూరికార్డులు ఉండడంతో పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనేతరులకు ఆర్​వోఎఫ్​ఆర్​పట్టాలు రావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలమేరకు త్వరలో గిరిజనులకు మాత్రమే పోడు పట్టాలిచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గిరిజనేతరులకు మరోసారి ఎదురుచూపులు తప్పేలా లేవు.  

అటవీహక్కుల చట్టం సాకుతో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 26,725 మంది గిరిజనేతరుల చేతుల్లో 85,161 ఎకరాల పోడు భూములు సాగులో ఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 21 మండలాల్లో 17,725 మంది గిరిజనేతరుల వద్ద 58,161 ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని10 మండలాల్లో 9వేల మంది గిరిజనేతరుల చేతిలో 27వేల ఎకరాలు సాగవుతున్నాయి. అటవీ హక్కుల చట్టం-–2005 ప్రకారం గిరిజనేతరులు.. కటాఫ్​తేదీకి 75 సంవత్సరాల ముందు నుంచి భూమిపై తమకు ఉన్న హక్కులను నిరూపించుకోవాలి. అంటే1935 నుంచి  సాగులో ఉన్నట్లు రికార్డులు చూపించాలి. కానీ 1950–-70 మధ్య నుంచే గిరిజనేతర రైతులు పోడు సాగు చేసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనిని బట్టి 1935 నుంచి రికార్డులు తేవడం దాదాపు అసాధ్యం గా కనిపిస్తోంది. మరోవైపు గిరిజన సంఘాలు కూడా గిరిజనేతర రైతులకు పోడు పట్టాలివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కేవలం గిరిజనులకు మాత్రమే పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించినట్లు తెలిసింది. అధికారికంగా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

గిరిజనులకు పట్టాలు రెడీ

ఈసారి గిరిజనేతరులకు పక్కనపెట్టి, గిరిజనులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1.37లక్షల ఎకరాలకు సంబంధించి 44,041 మంది రైతులకు,  ఖమ్మం జిల్లాలో 30వేల ఎకరాలకు సంబంధించి 6,767 మంది రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాస్​బుక్​ల ప్రింటింగ్​కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గిరిజనులకు పాస్​బుక్​లు పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

తక్షణమే పట్టాలివ్వాలి..

పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలి. సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి. ఆలస్యం చేయొద్దు. భూమిపైనే ఆధారపడి బతుకుతున్న వారికి న్యాయం చేయాలి. వారు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. రేపుమాపంటూ సాగదీయడం మానేయాలి.

- పొదెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం

గిరిజనులకైనా ఇవ్వండి..

గిరిజనులకైనా ముందు పోడు భూములకు పట్టాలివ్వండి. గిరిజనేతరుల విషయంలో కేంద్రం నుంచి సలహా తీసుకుంటామని కొర్రీ చూపించి గిరిజనులకు ఇవ్వకుండా ప్రభుత్వం నాటకాలాడుతోంది. బూచీ చూపించి ఆలస్యం చేయడం సరికాదు. 

- పాయం సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, 
గోండ్వాన సంక్షేమ పరిషత్​