- ఫోన్ ట్యాపింగ్‌పై ఈసీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తం
- ఎన్నికల టైమ్‌లో మా లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిన్రు
- ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి
- కేటీఆర్‌ను కాంగ్రెస్ వదిలినా.. మేం వదలం
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల టైమ్‌లోనూ బీఆర్ఎస్ ట్యాపింగ్‌కు పాల్పడిందని, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే తాము ఈసీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైలెవల్ ఎంక్వైరీ జరిపించాలి. మాజీ సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలి. దీని వెనుక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది తీవ్రమైన అంశం. దీని ఫలితాలు కూడా తీవ్రంగానే ఉంటయ్. దేశభద్రత, సమగ్రతకు భంగం వాటిల్లే అంశమేమైనా ఉంటే.. కేంద్ర హోంశాఖ సెక్రటరీ రాతపూర్వకమైన అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ, కేసీఆర్ నిజాం రాజులాగా, చట్టాలు.. కోర్టులను గౌరవించకుండా ఆటవిక రాజ్యంగా.. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా రాష్ట్రాన్ని వాడుకున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించింది. చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. రాజకీయపరమైన కక్ష సాధింపు కోసమే ఫోన్ ట్యాప్ చేశారు. వ్యక్తిగత గోప్యతకు, ప్రజల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారు.
2020, అక్టోబర్‌లో జరిగిన దుబ్బాక బై ఎలక్షన్లో, ఆ తర్వాత జరిగిన హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో మా పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పోలీసుల నివేదికతో తెలుస్తున్నది. ఇండస్ట్రియలిస్ట్‌లు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించారు. వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు’’అని ఆరోపించారు. ఒకరిద్దరి ఫోన్లు ట్యాపై ఉండొచ్చన్న కేటీఆర్ కామెంట్లను గుర్తు చేశారు. అప్పట్లో ఆయన మంత్రిగా కాకుండా.. షాడో సీఎంగా వ్యవహరించారని, కేసు నమోదయ్యేసరికి తనకేం సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ను కాంగ్రెస్ వదిలినా.. బీజేపీ మాత్రం వదలదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన్రు
పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచిందన్నారు. ‘‘కేసీఆరే ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారు. దీనికి ఆయనే ఆద్యుడు. కనీసం రాజీనామా చేయించకుండానే పార్టీ చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులనే ఎజెండాగా పెట్టుకున్నది.
కొన్ని కుక్కలు, నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారని కేసీఆర్ అంటున్నడు.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇదే కదా.. వేరే పార్టీ ఎమ్మెల్యేలను మీరెందుకు చేర్చుకున్నరు? పార్టీ ఫిరాయించిన వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి పార్టీలు మారాలి’’అని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు మాధవీ, ప్రకాశ్ రెడ్డి, కిశోర్, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపడ్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరుతో ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ గారడీ చేసిందన్నారు. రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీ అమలు చేశాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేయలేదని, ఇస్తామన్న డబ్బులూ ఇవ్వలేదని ఆరోపించారు.