కాంగ్రెస్సా.. కమలమా?.. కన్ఫ్యూజన్​లో మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్సా..  కమలమా?..  కన్ఫ్యూజన్​లో మాజీ ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్​కు రాజీనామా అంటూనే ఆ పార్టీ నేతలతో టచ్​లో 

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ హయాంలో పలు పదవులు నిర్వహించిన ఆయన గత లోక్ సభ ఎన్నికల టైమ్​లో టీఆర్ఎస్ లో చేరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నడు. తీరా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు. పైగా మరుసటి రోజు ప్రగతి భవన్ వెళ్లిన ఆయనకు సీఎం నుంచి ఒట్టి నమస్కారం తప్ప ఏ హామీ దక్కలేదు. దీంతో కంగుతిన్న సదరు నేత ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూరా తిరిగి తన అనుచరులతో చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లడమే కరెక్ట్ అని ఎక్కువ మంది చెప్పారట. అయితే.. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి బయటి రాగనే ఆ స్థానాన్ని మరో నేత ఆక్రమించేశారు. పైగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కు దగ్గరి మనిషి. ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా గెలిచిపోయానన్నంత కాన్ఫిడెన్స్ తో తిరుగుతున్నారు. తనకు ఎవరి మద్దతు అవసరం లేదన్న ధీమాతో ఉన్నారు. దీంతో సదరు నేతకు కాంగ్రెస్ వెళ్లాలని ఉన్నా.. కనీసం తన మద్దతు కూడా కోరని వ్యక్తి గెలుపు కోసం ఎలా పని చేయాలనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. అనుచరులంతా కాంగ్రెస్ లోకి వెళ్లాలని చెప్తుంటే.. ఆయన్ను బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఒక వేళ బీజేపీ నుంచి పోటీ చేస్తే త్రిముఖ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తన చిరకాల ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తాడనే భయం కూడా సదరు మాజీని వెంటాడుతుండడంతో బీజేపీలో చేరాలనే అంశంపై కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ‌‌‌‌ఏ పార్టీలో చేరాలో అర్థంగాక, ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్ లో పడ్డ సదరు నేత పది రోజులుగా తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. మీడియా వాళ్లు పొద్దున అడిగితే సాయంత్రం చెప్తానని.. సాయంత్రం అడిగితే రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని దాటేస్తూ వస్తున్నారు. ఈ లీక్ లతో అప్రమత్తమైన బీఆర్ఎస్ కీలక నేత ​బుధవారం రాత్రి పిలిపించుకుని పార్టీని వీడొద్దని, రెండు రోజులు టైమివ్వమని కోరినట్లు తెలిసింది. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పోస్టు ఇప్పిస్తానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురువారం హామీ ఇవ్వడంతో మళ్లీ డైలమాలో పడినట్లు సమాచారం.

అబ్బే.. మేమిద్దరం ఒక్కటే

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌‌లో చేరిన కుంభం అనిల్ కుమార్‌‌‌‌రెడ్డి.. భువనగిరి అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికే టికెట్​దక్కింది. దీంతో నారాజ్ అయిన కుంభం మళ్లీ కాంగ్రెస్‌‌లోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం భువనగిరికి కుంభం వచ్చారు. రావి నారాయణరెడ్డి వర్ధంతి ప్రోగ్రాంలో ఎమ్మెల్యే పైళ్లతో కలిసి పాల్గొన్నారు. తర్వాత ఇద్దరూ కలిసి ఓ పెండ్లికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. తర్వాత ప్రెస్​మీట్‌‌ పెట్టారు. తాము ఇద్దరం ఒక్కటే అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్‌‌లో ఉంటానని, కేసీఆర్ వెంటే నడుస్తానని కుంభం అనిల్ కుమార్‌‌‌‌రెడ్డి చెప్పారు. కానీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి మాత్రం ఏం మాట్లాడలేదు. ‘‘టికెట్ కోసం కుంభం ప్రయత్నించకపోతే మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌‌ రెడ్డి, జగదీశ్​రెడ్డిని, హరీశ్​రావును, పట్నం మహేందర్​రెడ్డిని వరుసబెట్టి ఎందుకు కలిసినట్టో’’ అని శేఖర్ రెడ్డి అనుచరులు సెటైర్లు వేస్తున్నారట!