ఎన్నికల్లో పోటీ చేసి అప్పులపాలై... గుండెపోటుతో బీఆర్ఎస్​ లీడర్​ మృతి

ఎన్నికల్లో పోటీ చేసి అప్పులపాలై... గుండెపోటుతో బీఆర్ఎస్​ లీడర్​ మృతి

గద్వాల, వెలుగు : ‘ఎన్నికల్లో నిలబడి అప్పుల పాలయ్యా..మినిస్టర్లు కేటీఆర్, హరీశ్​రావు మీరైనా నన్ను ఆదుకోండి’ అంటూ గద్వాల టౌన్ రెండోవార్డుకు చెందిన బీఆర్ఎస్ లీడర్ కుమ్మరి బీచుపల్లి (50) 15 రోజుల క్రితం సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వేడుకున్న నేతలతో పాటు స్థానిక లీడర్లు కూడా పట్టించుకోకపోవడంతో అప్పుల బాధతో  అనారోగ్యం పాలై గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ లో బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశాడు. చిట్టీల వ్యాపారం చేసుకునే బీచుపల్లి గత మున్సిపల్​ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున రెండో వార్డు కౌన్సిలర్​గా పోటీ చేశాడు. పార్టీలోని కొందరు లీడర్లు తనకు వ్యతిరేకంగా పనిచేశారని, ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టడంతో తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నాడు. 

ఎన్నికల్లో రూ.25 లక్షలు ఖర్చు చేసినా గెలవకపోవడంతో అప్పుల పాలయ్యానని ఆయన పెట్టిన సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. స్థానిక లీడర్లు, మినిస్టర్లు ఎవరూ అండగా నిలబడకపోవడంతో కుంగిపోయాడు.  కనీసం రూ.ఐదు లక్షలైనా సాయం చేయమని కనిపించిన ప్రతి లీడర్​కాళ్లా వేళ్లా పడ్డాడు. అయినా ఒక్కరూ పైసా ఇవ్వలేదు. దీంతో అప్పులు తీర్చే దారి లేక అప్పు ఇచ్చినవాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో బీపీ సమస్య వచ్చింది. తరచూ లో బీపీతో కింద పడిపోయేవాడు. ప్రైవేట్​హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకునే స్థోమత లేక కొద్దిరోజుల నుంచి గద్వాల ప్రభుత్వ హాస్పిటల్​లో చూపించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం లో బీపీ వచ్చి స్పృహ తప్పాడు. వెంటనే గద్వాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. మృతుడికి భార్య కొడుకు, కూతురు  ఉన్నారు. 

బీచుపల్లి మృతి తీరని లోటు 

బీచుపల్లి మృతి పార్టీకి తీరని లోటని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను జడ్పీ చైర్​పర్సన్​ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్ పరామర్శించి ఓదార్చారు.