
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పట్టాలు ఉన్నా పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇటీవల అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ సర్వే నంబర్ 381 లో అక్రమ కట్టడాలని 23 నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. రెవెన్యూ అధికారుల చర్యలను ఖండిస్తూ ఆదర్శ్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుల్తాన్పూర్లో కూల్చిన ఇళ్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల కింద పట్టా సర్టిఫికెట్ పొందిన 21 మంది పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా తహసీల్దార్ కూల్చి వేయడం దారుణమన్నారు.
ఇంటి నంబర్లు, టాక్స్లు, కరెంట్ మీటర్లు అధికారులే ఇచ్చారని ఇప్పుడు అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుందని, బాధితులకు అండగా బీఆర్ఎస్ నిలబడుతుందన్నారు. సుల్తాన్పూర్ ఘటనలో అధికారుల అత్యుత్సాహంపై ఉన్నతాధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి, మాణిక్ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.