ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు

ఓటమిపై సమీక్షలు మరిచి  జనంపై నిందలు
  • తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్​ఎస్ ముఖ్యుల  కామెంట్స్​
  • కాంగ్రెస్​కన్నా 1.85 శాతమే తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు
  • సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్​ ముఖ్య నేతల్లో ఆత్మవిమర్శ కనిపించడం లేదు. ఇప్పటికే ఏడు లోక్​సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో వాళ్లు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలనే విస్మయానికి గురిచేస్తున్నది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39కి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్​లో బీఆర్​ఎస్​ను ఓడించారని ఓ ముఖ్యనేత..  తాము 32 యూట్యూబ్​ చానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత..  స్కీమ్​లు అందుకున్నోళ్లు కూడా మోసం చేశారని మరో ముఖ్యనేత.. ఇట్ల ప్రజలను తప్పుబట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లయితే.. ‘‘జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నరు..  కానీ, సీఎం పదవి నుంచి కేసీఆర్​ దిగిపోతారని వాళ్లు భావించలేదు.. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడ్తున్నరు” అని వ్యాఖ్యానిస్తున్నారు.


కాంగ్రెస్​తో పోల్చుకొని తమ ఓటింగ్​పర్సంటేజీ తక్కువేం కాదని, కేవలం 1.85 శాతం ఓట్ల తేడానే ఉందని సమర్థించుకుంటున్నారు. కానీ, వరుసగా రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి అసలు ఎందుకు ఓడించారు? అందుకు కారణాలు ఏమిటి? అనే దానిపై విశ్లేషణలు కూడా ముఖ్యనేతలు చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత అందుకు దారితీసిన పరిస్థితులను సమీక్షించుకొని వాటిని సవరించుకుంటామని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని, వారి తరఫున నిలబడుతామని అంటుంది. కానీ, బీఆర్ఎస్​ముఖ్య నేతల నోటి నుంచి మాత్రం అలాంటి మాటలే రావడం లేదని కార్యకర్తలే అంటున్నారు. 
 

గెలిచిన సీట్లు తమ ఖాతాలోకి.. ఓడిన సీట్లు సిట్టింగ్​లపైకి..!

గ్రేటర్​ హైదరాబాద్​లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడో వంతు స్థానాల్లో బీఆర్​ఎస్​ గెలిచింది. జిల్లాల్లో మాత్రం భారీ ఓటమిని చవిచూసింది. గ్రేటర్​ హైదరాబాద్​లో విజయానికి తామే కారణమన్నట్లుగా కొందరు ముఖ్యులు మాట్లాడుతూనే.. ఇతర ప్రాంతాల్లో ఓటమికి మాత్రం సిట్టింగ్​ఎమ్మెల్యేలే కారణమని తోసేస్తున్నారు. పార్టీని నడిపించే వాళ్లు ఇంత బాధ్యతా రాహిత్యంగా ఎలా మాట్లాడుతారని,  గెలిస్తే అది కేసీఆర్ క్రెడిట్​అన్నట్లుగా, ఓడితే తాము బాధ్యులమన్నట్లుగా ముఖ్య నేతల తీరు ఉందని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘పార్టీ ఎందుకు ఓడిపోయింది.. అధిష్టానంతో పార్టీ కేడర్​కు లింక్​తెగిపోవడానికి కారకులెవరు?” అనే వివరాలను సమావేశాల్లో కార్యకర్తలు చెప్తున్నా వాటికి ముఖ్యుల నుంచి వివరణ రావడం లేదు. ఎవరి కారణంగా పార్టీ ఓడిపోయిందో వారినే పక్కన కూర్చోబెట్టుకొని సమీక్షలు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే బదులు రావడం లేదని కొందరు నేతలు, కార్యకర్తలు అంటున్నారు. 

వాస్తవాలను ప్రస్తావిస్తే.. ఎదురుదాడి!

తెలంగాణ భవన్​లో ఇప్పటి వరకు ఏడు లోక్​సభ నియోజకవర్గాలకు సంబంధించిన సన్నద్ధత సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కేడర్​ను ఎక్కువగా మాట్లాడించి లీడర్లు వాళ్ల సూచనలు వింటే పార్టీకి ఎక్కువ ప్రయోజనం కలిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ, సమీక్షలకు వచ్చిన కేడర్​ను కాకుండా స్టేజీపైన ఉన్న లీడర్లే గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వాళ్లు కూడా స్టేజీపై కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం, ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.  ‘‘సీఎం అనే రెండు అక్షరాలకన్నా కేసీఆర్​అనే మూడు అక్షరాలు పవర్​ఫుల్.. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్​పార్టీ సొంతం.. కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో అసహనం ప్రారంభమైంది.. రానున్న రోజుల్లో కేసీఆర్​అసెంబ్లీకొస్తే పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ” అంటూ మంగళవారం ఖమ్మం లోక్​సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్​ వ్యాఖ్యలు చేశారు.

 దీనిపై కార్యకర్తలు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడామో.. ఉమ్మడి ఖమ్మంలో ప్రజాబలమున్న నేతలను హైకమాండ్​విస్మరించి ఎవరికి ప్రాధాన్యం ఇచ్చిందనే అంశాలపై చర్చించకుండా ఏవేవో కబుర్ల కోసమే తమను ఇంతదూరం పిలువాలా అని కొందరు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో లింగాల కమల్​రాజ్​కు టికెట్​ఇచ్చి గొంతుకోశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన కమల్​రాజ్​ను పార్టీ పట్టించుకోకపోవడంతోనే ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని, టికెట్​ ఇచ్చిన పార్టీనే అభ్యర్థిని పట్టించుకోకపోవడం ఏమిటని మండిపడ్డారు. దీనికి కేటీఆర్​సమాధానమిస్తూ.. కమల్​రాజ్​ఇప్పటికే నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయారని, ఎమ్మెల్యే టికెట్​తో పాటు అభ్యర్థులకు రూ.40 లక్షలు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్​మాత్రమేనని అన్నారు. గొంతు కోశారనే మాటలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఓటమితో ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలకు ఓదార్పునివ్వాల్సింది పోయి ఎదురుదాడి చేసినట్టుగా ముఖ్య నేత మాట్లాడటం ఏమిటనే చర్చ పార్టీలో సాగుతున్నది. 

ఒకరిని మించి ఒకరు.. 

ఎమ్మెల్యేల తీరుతోనే పార్టీ ఓడిపోయిందని నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘‘బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న కోటరీనే పార్టీని నిండా ముంచేసింది..  కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు.. పార్టీ అధిష్టాన్ని కలువకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు.. తెలంగాణ ఉద్యమకాలం నుంచి నాతో సన్నిహితంగా ఉన్న కార్యకర్తలెవరైనా వచ్చి కలిస్తే వాళ్లను ఎమ్మెల్యేలు వేధించారు..” అని ఆమె అన్నారు. మొన్నామధ్య కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లు కన్ఫూజన్​లో తమను ఓడించారని అన్నారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత నాకు ఇంట్రస్టింగ్​ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌‌‌‌లలో ఇదే ఉత్తమమైనది. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు, 32 యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేవాళ్లం. ఈ పరిశీలన కొంతవరకు ఏకీభవించేదిగా అనిపిస్తున్నది’’ అంటూ ఇటీవల కేటీఆర్ ట్వీట్ చేశారు. కవిత, కేటీఆరే ఇలా మాట్లాడితే పార్టీలో సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఓటర్లను, తమను తప్పుబట్టడమే ముఖ్యనేతల పనిగా ఉందని, వాస్తవ పరిస్థితులపై విశ్లేషణలు సాగడం లేదని ఓ మాజీ ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయాం తప్ప కాంగ్రెస్​ గెలువలేదని రెండురోజుల కింద మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్ ​ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదు.. కేసీఆర్ ఏ పని చేసినా తప్పుబట్టిన మేధావుల నోటికి పక్షవాతం వచ్చిందా.. పడిపోయిందా? ఎందుకు ప్రశ్నించడం లేదు” అని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి కామెంట్లు చేశారు. ఇంకొందరు ముఖ్యనేతలు.. ప్రజలు ఎమ్మెల్యేలను ఓడించారని,  కేసీఆర్​ సీఎం పదవి నుంచి దిగిపోతారని వాళ్లు ఊహించలేరని అన్నారు.