
- అసెంబ్లీ మీడియా పాయింట్
బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఒక్కరోజు సర్వే చేసి.. నివేదిక బయటపెట్టని ఈ పార్టీ ఈరోజు బీసీ కులగణనపై మాట్లాడుతోందన్నారు. స్పీకర్ అనుమతితోనే సభ వాయిదా పడిందన్నారు.
స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 29 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. ఆరోజు బీసీలపై మీకు ఉన్న చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. మీలా నలుగురు నాలుగు గోడల మధ్య మాట్లాడి సభ ముగించే పద్ధతి మాది కాదన్నారు.
మరో ఉద్యమం తప్పదు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తే మరో ఉద్యమం వస్తుందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని అన్నారు. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కులగణనపై చర్చ అని అసెంబ్లీకి 11 గంటలకు పిలిచి ఎందుకు వాయిదా వేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
50 రోజుల్లో కులగణన.. దేశ చరిత్రలో జరగలే: బీర్ల ఐలయ్య
50 రోజుల్లో కులగణన దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గంగుల కమలాకర్ కు బీసీ కులగణనపై మాట్లాడే హక్కు లేదన్నారు. వారు గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఫాం హౌస్ లో దాచిపెట్టారని విమర్శించారు.
తెలంగాణ ఒక రోల్ మోడల్: విప్ రాంచంద్రనాయక్
దేశ చరిత్రలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని, కేవలం 50 రోజుల్లో కులగణన పూర్తి చేశామని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్ అన్నారు. సభాపతి అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని అన్న కూడా రాజకీయ అవివేకంతో బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారన్నారు. బీసీలకు అనుకూలంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం లేదన్నారు.
ఇంటి దగ్గర తయారు చేసిన స్క్రిప్ట్ చదవడం లేదు: మధుసూదన్ రెడ్డి
మీలాగా ఇంటి దగ్గర తయారు చేసిన స్క్రిప్ట్ మేము చదవడం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఫాం హౌస్ లో నలుగురు కూర్చొని బిల్లులు అసెంబ్లీలో పెట్టే సంప్రదాయం మాది కాదన్నారు. ఇప్పుడు అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందన్నారు.
ప్రభుత్వం తీరు బాగాలేదు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
శాసనసభ లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. తాము హుటాహుటిన నియోజకవర్గం నుంచి వస్తే.. సభ ప్రారంభించిన వెంటనే వాయిదా వేయడం బాధాకరమన్నారు. వారికి సమస్యలపై చర్చించే ఆలోచన లేనట్టు ఉందన్నారు.