- ఎమ్మెల్సీ దండే విఠల్
- కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్నియోజకవర్గ కన్వీనర్, సర్పంచ్, ఉప సర్పంచ్
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుంటే, విపక్షాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం తండ్లాడుతూ రాస్తారోకో, ధర్నాలు చేస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ విమర్శించారు. సోమవారం కాగజ్ నగర్లోని ఆయన నివాసంలో సిర్పూర్(టి) బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యామ్ రావు, చింతగూడ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ ఆత్రం ఆకాశ్, మురాయి శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు.
వారికి ఎమ్మెల్సీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను వదిలి కేవలం సొంత లాభాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక దుబారా, అధికార దుర్వినియోగం జరిగిందన్నారు.
మాలి కులస్తులకు ఎస్టీ హోదా ఇప్పించడంలో బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. హోదా విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కేంద్రంతో మాట్లాడేలా చొరవ తీసుకుని సాధించేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
