కాకా బాటలోనే వంశీ సేవ చేస్తడు

కాకా బాటలోనే వంశీ సేవ చేస్తడు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే కాకా వెంకటస్వామి బాటలోనే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసి భారీ మెజారిటీతో వంశీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో కోటపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్​లో చేరారు. 

వారికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ‘‘ఈ ప్రాంత ప్రజలు వెంకటస్వామిని నాలుగు సార్లు, నన్ను ఒకసారి ఎంపీగా గెలిపించారు. కాకా కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటది. కష్టపడి పని చేసే కార్యకర్తలు, లీడర్లకు ఎప్పుడూ గౌరవం, ప్రాధాన్యత ఉంటది. నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడ. పెద్దపల్లి ఎంపీగా ఈ ప్రాంతంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టా’’అని వివేక్ అన్నారు. 

బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే

కోటపల్లి మండలం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని వివేక్ అన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ సాకుతో గత బీఆర్ఎస్ సర్కార్ మండలాన్ని పట్టించుకోలేదన్నారు. ‘‘కోటపల్లి మండలం కాంగ్రెస్​కు కంచుకోట. వంశీకృష్ణకు భారీ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడి లీడర్లు, కార్యకర్తలపైనే ఉన్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తప్ప ఏ రోజు ప్రజల కోసం పని చేయలేదు’’అని అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన అంతా భూకబ్జాలు, దందాలతోనే కొనసాగిందని గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. 

‘‘కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జ్ హైమవతి, లీడర్లు రాంరెడ్డి, బాపురెడ్డి, హిమవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.