ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకత్వం

ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకత్వం

ఒక ఉద్యమ పార్టీ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయకుండా ఒక  కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యంగా మారింది.  ఒక ఉద్యమ పార్టీ ఎలా అహంకార పార్టీగా మారిందో,  ప్రజలు ఎలా మోసపోయారో,  ఇప్పుడు  బీఆర్ఎస్​ ఎలా తమ ఓటమిని జీర్ణించుకోలేక  అనవసరంగా  గట్టిగా  కేకలు వేస్తోందో  మనం చూస్తున్నాం.  తెలంగాణ కోసం పోరాడిన ప్రతి కుటుంబం,  ప్రతి యువకుడి ఆశయాల మీద చేసిన  రాజకీయ మోసం పేరు  బీఆర్ఎస్.   

స్వేచ్ఛకు  సంకెళ్లు 

ఒక నాయకుడు తప్పు చేస్తే  దాన్ని ప్రజల  ముందుకు తీసుకురావడం మీడియా బాధ్యత.   మీడియా  ఒక  విషయం  ప్రసారం చేస్తే దాన్ని  ప్రశ్నించాలి.  కానీ, మీడియా సంస్థ మీద దాడి చేయడమంటే.. అది స్వేచ్ఛా భావనకు ముప్పు చేస్తోంది.  మీడియా స్వేచ్ఛను  అణచివేయాలని చూస్తే  ప్రజాస్వామ్యంలో అది క్షమించదగినది కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందా?  ఒక వార్తా సంస్థ పట్ల కూడా ఈ స్థాయిలో ద్వేషంతో వ్యవహరిస్తే, ప్రజలతో  ఎలా వ్యవహరిస్తారు?   ఇది పార్టీ తన అసహనాన్ని  బయటపెడుతున్న  సంకేతంగా చూడవచ్చు. 

 రాష్ట్రానికి  అప్రకటిత  సీఎం స్థాయిలో  పనిచేసిన నాయకుడైన  కేటీఆర్  ఒక పబ్లిక్  మీటింగ్​లో  నేటి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన  పరుష వ్యాఖ్య  కేవలం వ్యక్తిగత స్థాయిని కాదు.  ఆయన మానసిక స్థితిని ప్రతిబింబిస్తోంది.  ఇది నిరాశ, తట్టుకోలేని మానసిక ఒత్తిడి ప్రతిఫలితం. ఇది పౌర సంస్కృతికి అవమానం. రాజకీయ  విభేదాలపై గళం ఎత్తడమే కాదు,  నీతిగా మాట్లాడటం  కూడా  ఒక నాయకుడి బాధ్యత.  ఓ నాయకుడు  ప్రజల తీర్పును  గౌరవించలేక, దాన్ని హేళన చేయడమంటే అది ప్రజల తలపైనే తిట్లు వేసినట్లే.   

చీకటి ఒప్పందమా?  

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎందుకు కేంద్రం తీసుకువచ్చిన మోదీ నిర్ణయాలకు మద్దతు ఇచ్చింది?  సీఏఏ,  ఎన్ఆర్​సీ,  రైతు వ్యతిరేక చట్టాలకు  బీఆర్ఎస్  రాజ్యసభలో మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ అసలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాదు.  కేంద్రం అడిగిన ప్రతి విషయాన్నీ అనుసరించి, రాజ్యసభలో చట్టాలకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో  మళ్ళీ బీజేపీతో  ‘చీకటి  ఒప్పందం’  ఏర్పరిచి వారి అవసరాలకు అనుగుణంగా  వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. 

 బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో తెలంగాణకు సాధ్యమైన అభివృద్ధి, అసలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయింది.  రైతులు అప్పుల్లోనే ఉన్నారు, యువత నిరుద్యోగంలో ఉన్నారు.  రుణమాఫీ  రాయితీల పేరుతో కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు.  తెలంగాణలో  నిరుద్యోగ భృతిని వాగ్దానం చేసిన బీఆర్ఎస్  గత పదేళ్ళలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్  కూడా సమయానికి ఇవ్వలేదు.  పేపర్ లీకులు, గ్రూప్ పరీక్షల వాయిదాలు, పోలీస్ పరీక్షల గందరగోళం ఇవన్నీ యువత భవిష్యత్తును నాశనం చేశాయి.  బీసీ సంక్షేమం కోసం బీఆర్ఎస్  పెద్దగా చేసిందిలేదు. బీసీ కమిషన్ ప్రతిపాదనలు కూడా అమలుకాలేదు. డబుల్ బెడ్ రూం హామీ మరచిపోయారు.   దళితబంధు పేరుతో  ఒక్కటొక్కరికి నాటకీయ కార్యక్రమాలు. సమగ్ర ప్రయోజనం లేదు. 

 ఫ్యామిలీ పైకి-తెలంగాణ కిందికి.. 

టీఆర్ఎస్​లో  నిర్ణయాలు పార్టీ వర్గాలు తీసుకోవు. కేవలం కేసీఆర్  కుటుంబమే నిర్ణయాలన్నీ తీసుకుంటుంది.  గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు, అభ్యర్థుల ఎంపిక వరకూ  అన్నీ ఒకే కుటుంబం నిర్ణయం మేరకు జరుగుతాయి. ఇతర  సామాన్య నాయకులకు  అవకాశమే లేదు. జనం ఎదగడానికి కాదు.. ఒక కుటుంబం ఎదగడానికి బీఆర్​ఎస్​ పార్టీ  పనిచేసింది.  

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అప్పు రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ  ఇవన్నీ పేరుకి ప్రాజెక్టులు.  కానీ,  ఖర్చుల విలువ లేని దివాలాకోరుతనం.  రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఐటీ టవర్స్ కడితే అభివృద్ధి కాదు. గ్రామాల్లోకి తాగునీరు,  విద్య,  ఆరోగ్య పరిరక్షణ రాలేదు. కుల రాజకీయం, కుటుంబ పాలన పైగా  ప్రజలకు  దూరమవడమే  పాలకుల  పరాజయానికి కారణం.

మోసాన్ని గుర్తుపెట్టుకోండి

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజల విశ్వాసాన్ని, పోరాట స్ఫూర్తిని రాజకీయ శక్తిగా 
మార్చుకుని అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఓడిపోయిన తర్వాత  మాత్రం అసహనంతో, ద్వేషంతో, అసత్య ప్రచారాలతో వ్యవహరిస్తోంది. పోరాటం ఫలంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని, మళ్ళీ మోసపోయే స్థితికి తీసుకెళ్లకండి. 

తెలంగాణ ప్రజలుగా మన బాధ్యతగా మళ్లీ ఇలాంటి మోసపు మాటలను అంగీకరించకూడదు. భావోద్వేగాలతో కాదు.. అనుభవంతో బుద్ధి చెప్పాలి.  బీఆర్ఎస్ ఇంకా ఫ్రస్ట్రేషన్​లోనే ఉంది. ఇంకా గందరగోళంగా  మాట్లాడుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక మళ్ళీ మీ నమ్మకాన్ని దోచుకుందామని భావిస్తోంది. ఆ మోసాన్ని గుర్తుపెట్టుకోండి.

-డా. కేశవులు భాషవత్తిని, ఎండీ. సైకియాట్రీ -