పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

 

హైదరాబాద్, వెలుగు : స్టేషన్‌‌ ఘన్‌‌పూర్, భద్రాచలం నియోజకవర్గాల నుంచి బీఆర్‌‌ఎస్‌‌ సింబల్‌‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం వాళ్లను అనర్హులుగా ప్రకటించాలన్నారు. ఇందులో ప్రతివాదులుగా అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని చేర్చారు.

అసెంబ్లీకి 2023 నవంబర్‌‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ నుంచి వాళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచాక గత మార్చి 31న సీఎం రేవంత్‌‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌‌చార్జ్ ఆధ్వర్యంలో కడియం, ఆయన కుమార్తె కావ్య, ఏప్రిల్‌‌ 7న సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌‌రెడ్డి సమక్షంలో తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌‌ పార్టీలో చేరారని వివరించారు. వారిపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.