
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వెంటనే అతన్ని ఢిల్లీ తరలించారు.
బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల దగ్గర ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. గోరంట్ల బుచ్చిబాబు పేరుమీద గోరంట్ల, అసోసియేట్స్, శ్రీ ఎంటర్‌ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. అతను హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలతో సీబీఐ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ కు ముందు బుచ్చిబాబు నివాసంలో పలు సార్లు సీబీఐ అధికారులు సోదాలు జరిపి.. కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.
ఢిల్లీ ఎక్సైజ్ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ కుంభకోణంలో సౌత్‌గ్రూప్ విజయ్‌నాయర్ ద్వారా..ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ తెలిపింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని వెల్లడించింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరమే ఇండోస్పిరిట్‌లో 65శాతం కవిత...మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు పేర్కొంది. ఇండో స్పిరిట్‌లో కవిత రూ. 3 కోట్ల 40 లక్షలు, మాగుంట రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.