
వరంగల్, వెలుగు: కాంగ్రెస్ సర్కారుకు మరింత గడువు ఇవ్వడానికే కేసీఆర్ బయటకు రావడం లేదని ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనచారి, తక్కళ్లపల్లి రవీందర్‍రావు అన్నారు. రేవంత్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎత్తి చూపడానికి తమ వద్ద అస్త్రశస్త్రాలు ఉన్నాయన్నారు. శుక్రవారం హనుమకొండ బీఆర్‍ఎస్ ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్‍భాస్కర్ ఆధ్వర్యంలో ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటేనే మోసమని..16 నెలల్లోనే ప్రజల్లో ఆందోళనలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచం తెలంగాణ వైపు చూస్తే.. రేవంత్‍రెడ్డి హెచ్‍సీయూ భూముల చర్యలతో మరోసారి ఇటువైపు చూసిందన్నారు.
బీఆర్‍ఎస్ మూడు దశల పోరాటం చూశారని.. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నాలుగో దశ పోరాటం ఉంటుందన్నారు. ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పీచ్ కోసం జనాలు ఎదురుచూస్తున్నారన్నారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్‌బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు.