చిచ్చు పెట్టేందుకే చేవేళ్లలో బీజేపీ సభ : ఎంపీ రంజిత్ రెడ్డి

చిచ్చు పెట్టేందుకే చేవేళ్లలో బీజేపీ సభ : ఎంపీ రంజిత్ రెడ్డి

ఏప్రిల్ 23న చేవేళ్లలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభపై బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవేళ్లకు ఏదో చేద్దామని వస్తున్నారని అనుకున్నామని, కానీ.. ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వచ్చారని అనుకోలేదని చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్టేజీపై మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడు కూడా అవగాహన లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. గత తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ‘మెడికల్ కాలేజ్ ఇచ్చారా..? ఐటీఆర్ ఇచ్చారా, ఫార్మాసిటీ ఇచ్చారా..?’ అని రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని కోరుకుంటే.. మీరు(బీజేపీ వాళ్లు) సంక్షోభాన్ని కోరుకుంటారని ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం 10 శాతమైన అమలు చేయాలంటూ సవాల్ విసిరారు. బీజాపూర్ చేవెళ్ల రహదారికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 

చేవేళ్ల బీజేపీ మీటింగ్ పూర్తిగా బండి సంజయ్ ను మెప్పించడానికే నిర్వహించినట్లు ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికే మీటింగ్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు గానీ... దాని గురించి మాట్లాడే అర్హత బీజేపీ వాళ్లకు లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి.. ఈ సంవత్సరంలోనే తప్పనిసరిగా పూర్తి చేస్తుందన్నారు.