- పనులు ఆపి విచారణ జరపాలంటూ వినతి
- 1.865 టీఎంసీలంటున్నా..
- 8 టీఎంసీల సామర్థ్యంతో టన్నెల్ నిర్మాణాలు
- హైదరాబాద్‌కు 510 అడుగులే దిక్కైతే.. 493.47 అడుగుల నుంచే నీళ్లు తోడేలా ఏపీ ఇన్‌టేక్
- అనుమతుల్లేకుండానే 100 కోట్ల పనులు చేపట్టారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ తాగునీటి భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని బీఆర్ఎస్పార్టీ ఆక్షేపించింది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా, తెలంగాణకు గానీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణ పనులు చేపట్టిందని ఆరోపించింది. ఆ ప్రాజెక్టును వెంటనే ఆపాలని కృష్ణా బోర్డును కోరింది. సోమవారం బీఆర్ఎస్ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ల నేతృత్వంలోని పార్టీ నేతలు.. కృష్ణా బోర్డు చైర్మన్ శుభ్రాంగ్షు బిశ్వాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
తాగునీటి అవసరాల ముసుగులో ఏపీ కుట్ర
తాగునీటి అవసరాల ముసుగులో ఏపీ ప్రభుత్వం భారీ నీటి తరలింపుకు తెరలేపిందని బీఆర్ఎస్పార్టీ తన వినతిపత్రంలో ఆరోపించింది. పల్నాడు ప్రాజెక్టుతో 1.865 టీఎంసీలు తరలించుకుంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న టన్నెల్, ఇతర నిర్మాణ పనుల సామర్థ్యం ఏకంగా సుమారు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న నీటి అవసరానికి, వాస్తవంగా నిర్మిస్తున్న సామర్థ్యానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సమగ్ర సాంకేతిక విచారణ జరపాలని కోరింది. ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండానే వంద కోట్ల రూపాయలకుపైగా పనులు పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయని గుర్తు చేసింది.
హైదరాబాద్‌కు 510 అడుగులు.. పల్నాడుకు 493.47 అడుగులా?
పల్నాడు మంచినీటి ప్రాజెక్టు డిజైన్ హైదరాబాద్ భవిష్యత్తుకు శాశ్వత నష్టం కలిగించేలా ఉందని హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ కాలం నుంచే నాగార్జునసాగర్ ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద హైదరాబాద్‌కు తాగునీరు అందుతోందని, ఏఎంఆర్పీ ద్వారా సిటీకి నీటిని తరలించాలంటే జలాశయంలో కనీసం 510 అడుగుల నీటిమట్టం ఉండటం కీలకమని పేర్కొన్నారు.
ఆ స్థాయికి నీరు పడిపోతే హైదరాబాద్‌కు నీటి సేకరణ సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోతుందని వెల్లడించారు. కానీ, ఏపీ ప్రభుత్వం పల్నాడు ప్రాజెక్టు కోసం నాగార్జునసాగర్ ఫోర్‌షోర్ వద్ద దిగువ ఇన్‌టేక్ పాయింట్‌ను ఏకంగా 150.45 మీటర్లు (493.47 అడుగులు) వద్ద ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఉందని లేఖలో పేర్కొన్నారు. అంటే హైదరాబాద్‌కు చుక్క నీరు తీసుకోవడం సాధ్యం కాని డెడ్ స్టోరేజీ స్థాయిలోనూ ఏపీ నీటిని తరలించుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కళ్లముందే పోతిరెడ్డిపాడు చేదు అనుభవం..
గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలోనూ ఏపీ ఇలాగే వ్యవహరించిందని బీఆర్ఎస్ గుర్తు చేసింది. చెన్నై తాగునీటి అవసరాల పేరుతో శ్రీశైలం నుంచి 1,500 క్యూసెక్కులతో మొదలైన పోతిరెడ్డిపాడు, ఆ తర్వాత 11,150 క్యూసెక్కులకు, అనంతరం 44,000 క్యూసెక్కులకు విస్తరించిందని, భవిష్యత్తులో 80,000 క్యూసెక్కుల వరకు పెంచే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయని గుర్తుచేసింది.
పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు వెంటనే ఆపాలి : జగదీశ్ రెడ్డి
ఎలాంటి అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ గర్భంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పల్నాడు గ్రిడ్ విషయం వారం క్రితమే తెలిసిందని బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి అంగీకరించారని, కేటీఆర్ ప్రశ్నించాకే ఏపీ ప్రభుత్వం బోర్డుకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. సోమవారం జలసౌధలో కృష్ణా బోర్డు చైర్మన్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
