
పద్నాలుగేళ్ల ఉద్యమ నేపథ్యంతో రూపుదిద్దుకున్న రాజకీయ పార్టీ బీఆర్ఎస్, పదేళ్ల అధికార పాలన తర్వాత ప్రస్తుతం అనేక అంశాలలో కనిపిస్తున్న కుదుపు చిన్నదే అనిపించవచ్చు. పరాయి పార్టీలు క్షేత్రస్థాయిలో అంతగా పెరగడం లేదు కదా, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఉన్నాం కదా అందుకే క్షేత్రంలో మనమే బలంగా ఉన్నామని అనిపించవచ్చు. కానీ, భవిష్యత్తును ఊహించుకుంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సొంత పార్టీ నేతల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నది.
అవినీతి ఆరోపణలు, వరుస కమిషన్ విచారణలు, కుటుంబ కుంపట్లు, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటి అంశాలు బీఆర్ఎస్ క్యాడర్‌లో నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లో కలిసిపోయి, వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ ఆ దిశగా సమర్థవంతంగా అడుగులు వేయలేకపోతోంది.
ఇప్పుడున్న సంక్షోభ సమయంలో ఆ గౌరవాన్ని తిరిగి పొందడం బీఆర్ఎస్ ముందున్న అతిపెద్ద సవాల్. బీఆర్ఎస్ ఎంచుకునే మార్గం దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ పదేండ్ల విలువైన కాలాన్ని పార్టీ భవిష్యత్ కోసం,
సుపరిపాలన లేకుండా కేవలం ప్రత్యర్థి పార్టీల పతనం కోసం వెచ్చించి ఇప్పుడా ఫలితాల్ని అనుభవిస్తున్నారు. ఒక పక్క పార్టీ ఓటమి మరో పక్క పార్టీలో అంతర్గత తిరుగుబాట్లు, ప్రతిపక్ష పార్టీ అధికారం పక్షంపై పోరాడాల్సిన సమయంలో పార్టీలో సొంత విభేదాలతో, పంచాయితీ సర్దుబాట్లతో బీఆర్ఎస్ కుస్తీపట్లు పడుతోంది. ఇటీవలే పార్టీ ఇంటర్నల్ సర్వేలో అధికార పార్టీ హవా అంతగా లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష పాత్రలో గ్రాఫ్ తగ్గుతోందట. పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నమ్మడం లేదని ఆ సర్వేలో తేలిందని సమాచారం తెప్పించుకున్న విశ్లేషకుడొకరు చెప్పారు. ఈ పరిస్థితి దేనికి సంకేతం?
అవినీతి మరకలను తుడుచుకోగలరా?
అవినీతి ఆరోపణలు ఒక రాజకీయ పార్టీకి ఎంత ప్రమాదకరమో చెప్పనవసరం లేదు. తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకుల నుంచి పారదర్శకతను ఆశిస్తారు. కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రం పునర్మిణానికి కేసీఆర్ పూనుకునే కొంత ప్రయత్నం చేసినా కుటుంబ ఆధిపత్యం వల్ల అందులో ఆయన విజయం సాధించలేకపోయారు. ఫలితంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎంత దగ్గరయ్యారో అంతే వేగంగా ఆ జనాలకు దూరమవుతున్నారు.
ఇప్పుడు పార్టీని నీడలా వెంటాడుతున్న సమస్య బీఆర్ఎస్ అవినీతి, కుటుంబం అవినీతి. పదేండ్లలో పార్టీ ఖాతాలోకి అధికారికంగా వచ్చిన నిధులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు పెరగడం వంటివి తెలంగాణ సమాజం హర్షించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో గోల్మాల్, వేయి కోట్ల గొర్రెల స్కాం, ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ సహా భూ కుంభకోణాలు, మద్యం విధానంలో అక్రమాలు వంటి ఆరోపణలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.
ఇంజినీర్లపై ఏసీబీ కేసులు
ఇటీవల ముగ్గురు ఇంజినీర్లపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో వేల కోట్లు ఆస్తులు బయటపడ్డాయి. అంటే కాళేశ్వరంలో సాదా సీదా ఇంజనీర్లే వందల కోట్లు దోచుకుంటే ఇక ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియగా ఉన్న కేసీఆర్ ఇంకెంత దోచుకున్నారనే చర్చ సహజంగా జరుగుతున్నదే. అంతేకాదు కాళేశ్వరం కమిషన్ నివేదికలోని 665 పేజీల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం కంటే వ్యక్తిగత ఆయన తప్పిదాలపైనే చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు కౌంటర్‌గా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఇచ్చిన పోటీ ప్రజంటేషన్ రాజకీయ దాడికి మాత్రమే ఉపకరించింది. కాని ఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలు, విధానపరమైన నిర్ణయాలపై అన్ని కోణాల్లో ఆధారాలతో సహా బయటపడితే హరీష్ మాత్రం అవేమి చర్చించకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ప్రజల్లో బీఆర్ఎస్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది.
కుటుంబ కలహాలు
అధికారం కోల్పోయిన 20 నెలల్లోనే కేసీఆర్ కుటుంబంలోనే వేరు కుంపట్లు కొత్త చర్చకు దారీతీస్తున్నాయి. మొదట్లో కేటీఆర్, హరీష్ మధ్య వర్గపోరు, ఆధిపత్య సమస్య అధికంగా ఉండేది. కానీ, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినా అది తాత్కాలికమేనని అందరికీ తెలిసిన విషయం. ఇక కేసీఆర్ తన సొంత కూతురు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం, కుటుంబ సంక్షోభాన్ని నివారించలేకపోయారన్న నాయకత్వపు ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు.
కవిత కూడా పార్టీతో, కుటుంబంతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టు తెలుస్తోంది. పార్టీని నడిపే సమర్ధత కేటీఆర్‌కు లేదని, లిల్లిపుట్ అని జగదీశ్ రెడ్డిపై, తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడున్నారని మాజీ మంత్రి సబిత ఫ్యామిలీని ఆమె ప్రశ్నించారు. అంటే తనదారికి ఎవ్వరు అడ్డొచ్చినా కవిత తనదైన శైలిలో రాజకీయ బాంబులు పేల్చుతూ ముందుకు సాగుతుండడం ఆ ఫ్యామిలీలో అతి పెద్ద సంక్షోభానికి సంకేతంగా చూడాలి. పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న ఆమె ఆరోపణ పార్టీని మరింత ఇరకాటం పెట్టింది. .
రాజీనామాలను ఆపగలరా.!
ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంకాగా మరికొంత మంది కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామాయే ఉదాహరణ. గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజీనామా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదమున్నది. ఆయన బాటలోనే అదే జిల్లాకు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేర బోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
రెండున్నర ఏండ్ల కింద మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అగ్రనాయత్వాన్ని ఓ ఆటాడుకున్న ఘట్టంలో గువ్వల బాలరాజు ఒకరు. ఆయనతోపాటే మిగిలినవారు కూడా బీజేపీ ముఖ్యనేత బీఎల్ సంతోష్‌ను కలిసి ఎమ్మెల్యేల కొనుగోలు స్కెచ్ అంతా కేసీఆర్ ప్లాన్ అని చెప్పుకున్నారని తెలుస్తోంది. సదరు నేతలంతా ఇప్పుడు బీజేపి తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
కిం కర్తవ్యం
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ గత వైభవాన్ని కోల్పోతోందన్నది నిజం. బీఆర్ఎస్ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లో స్వయంగా కేసీఆర్ ఉండాలి. అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా స్పందించి, విచారణలకు సహకరించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించాలి.
కుటుంబ ఆధిపత్యం నుంచి బయటపడి పార్టీలో ఇతర నాయకులకు అవకాశం కల్పించాలి. కేటీఆర్ వంటి నాయకులు ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలి. చివరగా ప్రజల సమస్యలపై దృష్టి సారించి, ప్రభుత్వాల వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టడం ద్వారా ప్రతిపక్షంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలి.
తగ్గుతున్న పార్టీ గ్రాఫ్ ఇటీవల బీఆర్ఎస్ అనధికారంగా జరిపిన ఓ ఇంటర్నల్ సర్వేలో వెల్లడైన విషయం ఆందోళనకరం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది తప్ప పెరగడం లేదని సర్వేలు సూచిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ ప్రజల్లో నమ్మకం తిరిగి పొందడంలో విఫలమవుతోంది.
2024 ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లే కాకుండా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అంటే అధికారం కోల్పోయిన ఆరు నెలలకే పార్టీ గ్రాఫ్ అంతగా పడిపోయింది. తర్వాత ప్రజా సమూహంలో అనేక సమస్యలున్నా కేవలం సోషల్ మీడియా, కృతిమ ఆందోళనలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ సొంత బలాన్ని పెంచుకోలేకపోతోంది. అంటే కేటీఆర్, హరీష్ కు ప్రజాదరణ ఉన్నా పార్టీని కాపాడే పరిస్థితి లేదన్నది స్పష్టమవుతున్నది. ఇక కేటీఆర్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి కీలక రాజకీయ సవాళ్లను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించినప్పటికీ ప్రజల్లో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్‌కు ఒక క్లిష్టమైన దశను సూచిస్తున్నాయి.
- వెంకట్ గుంటిపల్లి,తెలంగాణ జర్నలిస్టుల ఫోరం -