
- ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా
- మరో 10 మందిదాకా గులాబీ జెండాను పక్కనపెట్టే యోచన
- నాటి ‘ఫాంహౌస్ ఎపిసోడ్’ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే చాన్స్
- పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస విచారణలు
- ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు
- పార్టీ నేతలకు ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ఉచ్చు
- అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు
హైదరాబాద్, వెలుగు:ఓ వైపు పదేండ్ల పాలనలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణలు.. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ భారీ కుదుపునకు లోనవుతున్నది. వీటికి కేసీఆర్కూతురు కల్వకుంట్ల కవిత తిరుగుబాటు తోడుకావడంతో గులాబీ పార్టీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. ఆ పార్టీకి నలువైపులా ఉచ్చు బిగుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో ఓ కల్లోలమే చెలరేగుతున్నది. ముఖ్యంగా కవిత తీరు పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై పెద్దలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఒకదాని వెనుక మరొక సమస్య వస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.
కేసుల ఉచ్చులు..
బీఆర్ఎస్ పార్టీని విచారణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే గొర్రెల స్కామ్‌లో రూ.వెయ్యి కోట్ల దాకా దోచుకున్నారని ఏసీబీ విచారణలో తేలింది. అంతేకాదు.. ఇదే కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పైనా ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహించి, భారీగా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. ఇటు ఫార్ములా ఈ రేసు కేసులో.. నేరుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే ఉచ్చు బిగుసుకున్నది. రేసు నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్లను ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ 2 సార్లు విచారించింది. ఈ ఏడాది జనవరి 9న ఒకసారి, జూన్ 16న మరోసారి విచారించింది. మళ్లీ పిలుస్తామనీ చెప్పింది. ఇక, బీఆర్ఎస్‌కు ఫోన్‌ట్యాపింగ్ అతిపెద్ద సంకటంగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులను సిట్ విచారిస్తున్నది. ఈ వ్యవహారంలో కేసీఆర్‌వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి. బాస్ చెప్పినట్టే చేశామని అధికారులు కుండబద్ధలు కొట్టారు. ప్రజాప్రతినిధుల ఫోన్లనే కాకుండా.. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలనూ దొంగచాటుగా విన్నారన్న ఆరోపణలు అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఉన్నాయి.
విద్యుత్ కొనుగోళ్లు.. కాళేశ్వరం స్కామ్
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లోనూ కేసీఆర్పాత్ర ఉన్నట్టు పవర్ జ్యుడీషియల్ కమిషన్ నివేదిక తేల్చింది. నిరుడు మార్చిలోనే ప్రభుత్వానికి ఆ కమిషన్ నివేదిక చేరింది. రూ.3 వేల కోట్లకుపైగా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినట్టు కమిషన్ నివేదిక వెల్లడించింది. చత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరకు కరెంటును కొనుగోలు చేయడం వల్ల.. అది ఖజానాపై ప్రభావం చూపించిందని పేర్కొన్నది. వాస్తవానికి పవర్ కమిషన్ విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌కు నోటీసులిచ్చినా ఆయన హాజరు కాలేదు. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి తీరును తప్పుబడుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లి చైర్మన్‌ను మార్పించారు. అనంతరం జస్టిస్ ఎంబీ లోకూర్‌ను కమిషన్‌కు చైర్మన్‌గా నియమించగా.. ఆయన రిపోర్టును సబ్‌మిట్ చేశారు. ఇటు తాజాగా.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా పూర్తయింది. మొత్తం కేసీఆరే చేశారని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకున్నారని, మేడిగడ్డ కుంగడానికి కారకులయ్యారని తేల్చింది. భారీగా అవకతవకలు జరిగాయని, సొంత నిర్ణయాలు తీసుకున్నారని రిపోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించే ఆలోచనలో ఉన్నది. ఇప్పుడు ఈ రెండు కేసులూ పార్టీ అధినేతను కుదురుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీశ్‌రావునూ కమిషన్ దోషిగానే చూపించింది. కేసీఆర్ చెప్పినట్టు చేశారని స్పష్టం చేసింది.
తలనొప్పిగా కవిత వ్యవహారం
పార్టీ నేతల మాటెలా ఉన్నా.. సొంత కుటుంబ సభ్యుల వ్యవహారమే పార్టీ పెద్దలకు అతిపెద్ద తలపోటుగా మారిందన్న చర్చ జరుగుతున్నది. పార్టీలో కవిత తిరుగుబాటు పెద్దలకు కునుకు లేకుండా చేస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే కవిత పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వస్తున్నారు. మేలో అమెరికా నుంచి వచ్చాక కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఎయిర్‌పోర్టులోనే బాంబు పేల్చారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కుట్రలు చేశారంటూ తన అన్న కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి ఆమె చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై వ్యక్తిగత విమర్శలూ చేయిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. రెండు మూడు రోజుల కిందట కూడా తనపై పార్టీకి చెందిన ఓ పెద్ద నేత కుట్ర చేస్తున్నారంటూ మరో బాంబు పేల్చారు. నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత జగదీశ్‌రెడ్డిని లిల్లీపుట్అని వ్యాఖ్యానించారు. పార్టీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. మేలో అమెరికా నుంచి వచ్చాక ఆమె పార్టీకి దాదాపు దూరమయ్యారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే దేశ, విదేశాల్లో కమిటీలను వేశారు. బీసీ రిజర్వేషన్లపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా పార్టీ నేతలపై ఆమె విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, కవితను ఇప్పటివరకూ కేసీఆర్ పిలిపించుకోలేదు. సర్ది చెప్పనూ లేదు. ఆమె విషయంలో సైలెంట్‌గా ఉండాలనే పార్టీ నేతలకు కేసీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తున్నది.
పార్టీలో భవిష్యత్ లేదని..
విచారణలు ఒకెత్తయితే.. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. పార్టీలోని పెద్ద లీడర్లే కేసుల్లో చిక్కుకుంటుండడంతో.. ఆ కేసుల చుట్టూనే తిరగాల్సి వస్తుందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలో ఆయా లీడర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. మరో 10 మంది మాజీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అందులో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సమాచారం. బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీఎల్ సంతోష్‌తో మంతనాలు జరిపారన్న టాక్ వినిపిస్తున్నది. అయితే, ఇప్పటికే పార్టీ మార్పుకు సంబంధించి బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్పందించారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించారు. అయితే, ఈనెల 9న ఐదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నట్టు తెలిసింది.