జడ్పీ చైర్​పర్సన్​ పై... అవిశ్వాసానికి ప్లాన్​

జడ్పీ చైర్​పర్సన్​ పై... అవిశ్వాసానికి ప్లాన్​
  •  బలగమంతా బీఆర్ఎస్ దే
  •  జడ్పీ చైర్​ పర్సన్​కు సపోర్ట్ చేసేది ఎవరో..? 
  •  పార్టీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా
  •  జడ్పీ చైర్​ పర్సన్​ పదవికి రిజైన్​చేయలే

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆమెపై అవిశ్వాస అస్త్రాన్ని అధికార పార్టీ ప్రయోగించనుంది.  చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. జడ్పీటీసీలందరూ  బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే  కావడంతో  చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెడితే ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారనే చర్చ  కొనసాగుతున్నది.

బలగమంతా బీఆర్ఎస్ దే

  జిల్లాలో మొత్తం 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.  అందరు కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారే.  అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు అధికార పార్టీకి చెందిన వారే. గద్వాల నియోజకవర్గంలోని 5గురు జడ్పీటీసీలలో ఒక్కరు కూడా జడ్పీ చైర్ పర్సన్ కు సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఆలంపూర్  నియోజకవర్గంలోని ఏడుగురు జడ్పీటీసీలలో ముగ్గురు  చైర్ పర్సన్ కు సపోర్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన  అవిశ్వాస తీర్మానం  నెగ్గి తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు.  

ఆది నుంచి విభేదాలే

  పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి  ఎమ్మెల్యేలతో జడ్పీ చైర్ పర్సన్ కు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.   జడ్పీటీసీలందరూ బీఆర్ఎస్ వారే అయినా ప్రతి మీటింగ్ లో చైర్​పర్సన్​ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. నాలుగేళ్లలో ఒక  మీటింగ్ కూడా ఫుల్ కోరంతో జరిగిన దాఖలాలు లేవంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫండ్స్ కేటాయింపు, జడ్పీ సీఈఓ నియామకం, జడ్పీ చైర్ పర్సన్ ప్రోటోకాల్ వివాదాలు ఇలా అడుగడుగునా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి చైర్ పర్సన్ తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.  చైర్ పర్సన్ పదవీకాలం ఇంకా ఏడాది ఉన్నది. కొత్తవారికే అవకాశం కల్పిస్తే పార్టీకి కలిసొస్తుందని పలువురు బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

జడ్పీ వైస్ చైర్మన్ కే అవకాశాలు ఎక్కువ

బీఆర్ఎస్ అధిష్టానం  జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టితే  వైస్ చైర్మన్ గా ఉన్న సరోజమ్మను చైర్ పర్సన్ గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  బీసీ మహిళపై అవిశ్వాస తీర్మానం పెట్టి అదే బీసీ మహిళతో భర్తీ చేసేలా పార్టీ  హైకమాండ్ స్కెచ్ వేస్తున్నట్లు  సమాచారం. 

  మీటింగ్ పై అందరి ఫోకస్

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మొదటగా జడ్పీ మీటింగ్ జరగాల్సి ఉన్నది. ఇప్పుడు అందరూ జరగబోయే మీటింగ్ పై చర్చిస్తున్నారు. ఒకవేళ మీటింగ్ జరిగితే జడ్పీ చైర్ పర్సన్ హోదాలో సరిత ఒక్కరే ఇప్పుడు వేరే పార్టీకి చెందినవారిగా ఉంటే మిగతా జడ్పీటీసీలు ఏ విధంగా వ్యవహరిస్తారనే దానిపై చర్చ కొనసాగుతున్నది.

వారి వెనక మంత్రి హస్తం

 కాంగ్రెస్ లో చేరుతున్న జడ్పీ చైర్ పర్సన్ దంపతులు, ఏఎంసీ మాజీ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా జిల్లాకు చెందిన ఒక మినిస్టర్ కు అత్యంత సన్నిహితులు. మినిస్టర్ పై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేలు స్పందించేకంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన వారిపై తీవ్రంగా స్పందించేవారు. అలాంటివారు పార్టీని వీడుతుండడంతో వారి వెనుక మంత్రి ఉండి నాటకమాడిస్తున్నారనే ప్రచారాన్ని బీఆర్ఎస్  వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడి ఎమ్మెల్యేలకు మినిస్టర్ కు కూడా పడకపోవటంతో వారికి చెక్ పెట్టే విధంగా వారి అనుచరులతో నాటక మాడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.