జనగామ టికెట్ : పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు!

జనగామ టికెట్ :  పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు!

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు జనగామ టికెట్ కోసం కొట్లాడుకుంటున్న ఆ ఇద్దరు లీడర్లకు కాకుండా ఇంకొకరికి దక్కుతుందా అనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ​ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకే టికెట్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి నియోజకవర్గంలో సభలు, సమావేశాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. పల్లా ఎత్తులను అదే స్థాయిలో ముత్తిరెడ్డి తిప్పికొడుతున్నారు. ఇద్దరు లీడర్ల మధ్య కొట్లాటతో ఈ సీటును బీసీలకు ఇవ్వాలనే డిమాండ్​ మొదలైంది. 

ఇద్దరు రెడ్డి నాయకులు పోట్లాటకు బీసీ లీడర్​కు టికెట్​ ఇవ్వడం ద్వారా చెక్​పెట్టాలని కొందరు స్థానిక నాయకులు కూడా కోరుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు తమ అనుచరులు, సన్నిహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్​ కుమార్​ ఇటీవలే చేర్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో మీటింగ్ పెట్టి తనకు టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ అగ్రనేతలను కోరారు. సామాజిక సేవాకార్యక్రమాలు, అనారోగ్యాల బారినపడిన, కుటుంబ పెద్దను కోల్పోయిన ఫ్యామిలీలకు ఆర్థిక సాయం చేస్తూ ఆయన ప్రజల్లో ఉంటున్నారు. హైకోర్టు అడ్వొకేట్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జల్లి సిద్ధయ్యకు టికెట్​ఇవ్వాలని కోరుతూ శుక్రవారం జనగామలో ఆయన సన్నిహితులు, అడ్వొకేట్లు సమావేశమయ్యారు.

 పద్మశాలి నాయకుడు, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు టికెట్​ రేసులో ముందుకొచ్చారు. జనగామలో బల ప్రదర్శనకు దిగొద్దని పల్లాకు కేటీఆర్​స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో శుక్రవారం నియోజకవర్గంలో తన మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఎమ్మెల్సీ రద్దు చేసుకున్నారు. ఇంకోవైపు పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి కూడా తనకు చాన్స్​ఇవ్వాలని కేటీఆర్​పై ఒత్తిడి పెంచుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్​పోరులో ఇంకో ఎమ్మెల్సీకి చాన్స్​ దక్కుతుందా.. బీసీ లీడర్​కు అవకాశం ఇస్తారా అనే చర్చ జనగామ బీఆర్ఎస్​లో పెద్ద ఎత్తన సాగుతోంది.

‑ వెలుగు, హైదరాబాద్