కాంగ్రెస్ లేదంటే బీజేపీ.!.. బీఆర్​ఎస్ క్యాడర్ అంతా పక్క పార్టీల్లోకి..​​

కాంగ్రెస్ లేదంటే బీజేపీ.!.. బీఆర్​ఎస్ క్యాడర్ అంతా పక్క పార్టీల్లోకి..​​
  •     కడియం, ఆరూరి ఆధ్వర్యంలో పోటాపోటీగా చేరికలు
  •     క్షేత్రస్థాయిలో పల్చబడుతున్న గులాబీ పార్టీ
  •     పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి తప్పని ఎదురీత

హనుమకొండ, వెలుగు: బీఆర్​ఎస్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ బీఆర్​ఎస్ నుంచి వచ్చిన లీడర్లే కావడంతో క్యాడర్​ చీలుతోంది. కడియంకు మద్దతిచ్చే వాళ్లు కాంగ్రెస్​కు, ఆరూరికి సపోర్ట్​చేసే వాళ్లు బీజేపీలోకి జంప్​ అవుతున్నారు. దీంతో బీఆర్​ఎస్​క్షేత్రస్థాయిలో పల్చబడుతోంది. ఇప్పటికే పలువురు పెద్ద నేతలు పార్టీ మారగా, ఇతర నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీని వీడుతుండడంతో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురీత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బీఆర్​ఎస్​ ఖాళీ..!​

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో నిలిచారు. నెల రోజుల కిందటి వరకు బీఆర్ఎస్​లోనే కొనసాగిన ఆయన పదేండ్లు అధికారంలో ఉండి తన క్యాడర్​ను డెవలప్ చేసుకున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్​ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశించినా ఆరూరి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకుని 'కారు' దిగి కాషాయం కప్పుకొన్నారు. అప్పటికే అధికారం మారడంతో కొంతమంది బీఆర్​ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు వెళ్లగా, ఆరూరి మిగతా తన అనుచరులకు బీజేపీలో చేర్చుకునే పనిలో పడ్డారు. తన బలగాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎక్కడికక్కడ చేరికలు చేపట్టారు. 

మరోవైపు నిన్నమొన్నటి వరకు బీఆర్​ఎస్​లో ఉన్న స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు డాక్టర్ కావ్యకు ఎంపీ టికెట్ కోసం బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. అనంతరం కావ్యకు ఎంపీ టికెట్​దక్కగా, బీఆర్ఎస్​లో ఉన్న తన అనుచరులందరినీ హస్తం గూటికి చేరుస్తూ, తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులిద్దరూ బీఆర్​ఎస్​ క్యాడర్​ను చేర్చుకోవడంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్లెవరూ మిగల్లేదు. 

'కారు'కు తప్పని ఎదురీత..

పార్టీ నుంచి వెళ్లిన ఇద్దరు నేతలు బీఆర్​ఎస్ క్యాడర్​ను చీలుస్తుండటంతో గ్రామస్థాయిలో ఆ పార్టీ చాలావరకు బలాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. చాలాచోట్లా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు కాంగ్రెస్​, బీజేపీ వైపు వెళ్లడం, మరోవైపు అభ్యర్థిని ప్రకటించడంలో బీఆర్​ఎస్ ఆలస్యం చేయడం కూడా పార్టీకి తీవ్ర నష్టం చేసింది. తాజాగా బీఆర్​ఎస్​వరంగల్ ఎంపీ అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ చైర్మన్​ మారపెల్లి సుధీర్​కుమార్​ను ప్రకటించగా, క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ లీడర్లెవరూ మిగల్లేదు. దీంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి ఎదురీత తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంతో కొంత పార్టీ క్యాడర్ ను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు.