సీఎం కుటుంబానికే రాష్ట్రం బంగారమైంది: షర్మిల 

సీఎం కుటుంబానికే రాష్ట్రం బంగారమైంది: షర్మిల 

బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ రైతులు పంట నష్టపోతే పరిహారం ఇయ్యట్లేదు కానీ చనిపోతే మాత్రం రూ.5 లక్షల బీమా ఇస్తున్నారని  వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. సోమవారం ప్రజాప్రస్థానం పాదయాత్ర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడితండా నుంచి బట్వాన్​పల్లి, మన్నెగూడెం, పెర్కపల్లి, నెన్నెల మండల గుండ్లసోమారం, నర్వాయిపేట, మెట్​పల్లి మీదుగా చిత్తాపూర్​, ఆవడం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పెర్కపల్లి, ఆవడం గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు.

‘‘సీఎం కేసీఆర్​కు అధికార పిచ్చి తప్ప మరొకటి లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోచుకుంటున్నడు. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదు”అని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి దళితబంధు, గిరిజనబంధు, మైనారిటీ రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు అంటూ మోసం చేస్తున్నారని, ఆయన పాలనలో దగాపడని వర్గం లేదని విమర్శించారు. రూ.4లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ‘టీఆర్ఎస్​ పార్టీ బ్యాంక్ అకౌంట్​లో రూ.860 కోట్లు ఉన్నాయట.. దీన్నిబట్టి తెలంగాణ ఎవరికి బంగారుం అయ్యిందో ప్రజలు ఆలోచించాలి’ అని అన్నారు. కేసీఆర్​కు, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్​ఎస్​కు బందిపోట్ల రాష్ట్ర సమితి పేరు సరిగ్గా సూటవుతుందని ఎద్దేవా చేశారు.