బీఆర్ఎస్​ లో టికెట్ ఫైట్.. ఛాన్స్ మాకే అంటున్న సీనియర్ లీడర్లు

బీఆర్ఎస్​ లో టికెట్ ఫైట్..  ఛాన్స్ మాకే అంటున్న సీనియర్ లీడర్లు
  •        మంచిర్యాలలో నడిపెల్లి వర్సెస్ పూస్కూర్
  •        నేను సైతం అంటున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం
  •        చెన్నూర్లో నల్లాల ఓదెలు, బెల్లంపల్లిలో ప్రవీణ్
  •        సత్తా చాటుకునే ప్రయత్నాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 
  •        ఈ సారి చాన్స్ మాకే అంటున్న సీనియర్ లీడర్లు  

మంచిర్యాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టికెట్ ఫైట్ మొదలైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈసారి టికెట్ దక్కించుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్, జూనియర్ లీడర్లు పోటీ పడుతున్నారు. బెల్లంపల్లి, చెన్నూర్ ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్లు కావడంతో అక్కడ పోటీ చేసే చాన్స్ లేనివాళ్లు మంచిర్యాల జనరల్ సెగ్మెంట్ పై కన్నేశారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, పార్టీ  సర్వేలో ఈ ముగ్గురికి నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆశావహులు బీఆర్ఎస్ అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

  మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తాజాగా మంచిర్యాలపై ఫోకస్ పెట్టారు.  చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన ఆయనకు అక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో మంచిర్యాల నుంచి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పటిష్టతకు కృషి చేశారనే పేరుంది. ఆయన సేవలకు గుర్తింపుగా అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. దీంతో ఈసారి మంచిర్యాల టికెట్ రేసులో నేను సైతం అంటూ అధిష్టానానికి సంకేతాలు పంపారు. 

చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో....

చెన్నూర్, బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఈసారి టికెట్ తమకేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య దీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ వారికి పోటీగా టికెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదెలును పక్కకు నెట్టి పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ టికెట్ దక్కించుకున్నారు. ఓదెలు నామినేటెడ్ పోస్టు ఆశించగా, ఆయన భార్య భాగ్యలక్ష్మిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టి తాత్కాలికంగా సంతృప్తిపరిచారు. 

చెన్నూర్ లో  పాగా వేసిన సుమన్ ఆ స్థానాన్ని పదిలపర్చుకునేందుకు ఓదెలును రాజకీయంగా ఇరుకున పెట్టి అణగదొక్కారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లి అక్కడా ఇమడలేక సొంతగూటికి తిరిగొచ్చారు. నియోజకవర్గంలో సుమన్​ పై  తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఓదేలు భావిస్తున్నారు. అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య వివాదాల్లో చిక్కుకొని తరచూ వార్తల్లో నిలువడంపై అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ప్రవీణ్ 2014లో టికెట్ ఆశించినా దక్కలేదు. రానున్న ఎన్నికల్లో చిన్నయ్యకు ప్రత్యామ్నాయంగా ఆయన కనిపిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

ఈసారి కూడా టికెట్ దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని ఆరాటపడుతున్న చిన్నయ్యకు నిరాశ తప్పదంటున్నాయి.  ఇటీవల నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా మంత్రి కేటీఆర్ పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఈ నెల 8న బెల్లంపల్లి బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్.. చిన్నయ్య పేరును ప్రస్తావించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ ఆఫీసర్ కూడా ఒకరిద్దరు మంత్రుల ద్వారా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత సైతం ఈసారి బెల్లంపల్లి  లేదా చెన్నూర్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నారు. 
  మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈసారి ఆమెకు టికెట్ కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఖానాపూర్ టికెట్ రేసులో జన్నారం మండలానికి చెందిన యువ నాయకుడు బదావత్ పూర్ణానాయక్ పేరు వినిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ సంతోష్​ కుమార్ అనుచరుడిగా కేసీఆర్, కేటీఆర్ ల  దగ్గర గుర్తింపు ఉంది. కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

మంచిర్యాలపై సీనియర్ల కన్ను.... 

మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్​ రావు ఈసారి తన కొడుకు విజిత్​ రావును రాజకీయ వారసుడిగా రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. తండ్రీకొడుకుల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే దివాకర్​ రావును నాలుగుసార్లు అసెంబ్లీకి పంపినా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. పార్టీ సర్వేల్లోనూ ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ రావడంతో టికెట్ విషయంలో అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే అదునుగా పార్టీ సీనియర్ లీడర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ పూస్కూర్ రామ్మోహన్​ రావు రంగంలోకి దిగారు. ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ తో ఆయనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రామ్మోహన్రావుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ (ఓసీసీ) గుర్తింపు యూనియన్ ప్రెసిడెంట్ గా చాన్స్ ఇచ్చారు. 

ఈసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తుండడం, కల్వకుంట్ల ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండడంతో టికెట్ తనకేనని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పూస్కూరుకు  గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. హాజీపూర్ మండలంలో మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించడంలో రామ్మోహన్ రావు కృషి ఉందంటూ అక్కడివారు సన్మానాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలకతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో సంబంధాలు ఉండడంతో వారంతా ఇప్పుడు ఆయనతో టచ్ లో  ఉంటూ ఇంటర్నల్ గా  వర్క్ చేస్తున్నారని సమాచారం.