బీఆర్ఎస్ అగ్రనాయకులు తెలంగాణను దోచుకుంటున్నారు : మైనంపల్లి

బీఆర్ఎస్ అగ్రనాయకులు  తెలంగాణను  దోచుకుంటున్నారు    :  మైనంపల్లి

పాపన్నపేట, వెలుగు: బీఆర్ఎస్ అగ్రనాయకులు లక్షల కోట్లు దోచుకుంటున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. శనివారం మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్​లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధ్యంకాని హామీలిస్తూ ప్రజలను బీఆర్​ఎస్​ నాయకులు మభ్యపెడుతున్నారన్నారు. 

బీసీ బంధు, దళిత బంధు ఇవ్వకుంటే  బీఆర్​ఎస్​ నాయకుల ఇండ్లు  ముట్టడిస్తామని హెచ్చరించారు. కరోనా టైమ్​లో  మైనంపల్లి ఆర్గనైజేషన్ ద్వారా తన కొడుకు రోహిత్  అనేక సేవా కార్యక్రమాలు చేశారని, కానీ కొందరు బీఆర్​ఎస్​నాయకులు ఎక్కడ చేశారంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. వారి నుంచి అధికారం పోయాక అన్నింటికీ సమాధానం దొరుకుతుందన్నారు. 

ఉపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ యువ నాయకులు, ఎంఎస్ఎస్ఓ చైర్మన్ రోహిత్ మాట్లాడుతూ..  నియోజకవర్గంలో మరిన్ని  సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.