ఐపీఎస్ అవతారమెత్తి కోట్లు కొట్టేశాడు

ఐపీఎస్ అవతారమెత్తి కోట్లు కొట్టేశాడు

గురుగ్రామ్: అతనో బీఎస్ఎఫ్ ఆఫీసర్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో నష్టపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య, సోదరి సాయంతో ప్లాన్ అమలు చేశాడు. కానీ పాపం పండటంతో చివరకు కటకటాలపాలయ్యాడు.

హర్యానాకు చెందిన ప్రవీణ్ యాదవ్ బీఎస్ఎఫ్ లో డిప్యూటీ కమాండెంట్. మానేసర్లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ప్రవీణ్ దాదాపు రూ.60 లక్షలు నష్టపోయాడు. అప్పుల్లో కూరుకుపోయిన ప్రవీణ్ వాటి నుంచి బయటపడేందుకు  నకిలీ ఐపీఎస్ అవతారమెత్తాడు. భార్య మమత యాదవ్, సోదరి రీతూ యాదవ్ సహకారంతో జనాలను మోసం చేసి కోట్లు కొల్లగొట్టే ప్లాన్ వేశాడు. ఎన్ఎస్జీలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి పలువురి దగ్గర రూ. 125కోట్లు తీసుకున్నాడు.

జనాన్ని నమ్మించేందుకు ప్రవీణ్ ఎన్ఎస్జీ పేరుతో యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇందుకోసం యాక్సిస్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న సోదరి రీతూ యాదవ్ సాయం తీసుకున్నాడు. చివరకు ఓ బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.14కోట్ల నగదుతో పాటు కోటి రూపాయల విలువైన నగలు, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 7 లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనాలను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన ప్రవీణ్ యాదవ్ కు ఈ మధ్యనే అగర్తలాకు ట్రాన్స్ ఫర్ కాగా.. ఉద్యోగానికి రాజీనామా చేయడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి..

బీహార్లో ప్రాణాలు తీసిన కల్తీ మద్యం

వీల్‎చైర్ తో గిన్నీస్ రికార్డ్