BSNL టవర్ల కేబుల్ దొంగల అరెస్ట్.. రూ.2.75 లక్షల నగదు, రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్, కారు స్వాధీనం

BSNL టవర్ల కేబుల్ దొంగల అరెస్ట్.. రూ.2.75 లక్షల నగదు, రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్, కారు స్వాధీనం

మునగాల, వెలుగు : బీఎస్ఎన్ఎల్ టవర్స్ టార్గెట్ గా చేసుకుని కేబుల్స్ ఎత్తుకెళ్లే ఇద్దరు దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. గత జూన్ లో జిల్లాలోని నడిగూడెం, మునగాల పీఎస్ ల పరిధిలో బీఎస్ఎన్ఎల్ టవర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్స్ చోరీ అయినట్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

మునగాల సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు.  సోమవారం సమాచారం అందడంతో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి ఆకుపాముల గ్రామానికి వెళ్లారు. అక్కడ బీఎస్ఎన్ఎల్​ టవర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కారుతో ఉండగా అదుపులోకి  తీసుకుని విచారించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజాపురం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనాథ్, బుడుపుల వంశీ కృష్ణ, కోదాడకు చెందిన చలిగంటి శ్రావణ్ కుమార్​కలిసి  4 నెలలుగా నిఘా లేని టవర్లను టార్గెట్ గా చేసుకుని కేబుల్స్ ఎత్తుకెళ్తున్నట్టు ఒప్పుకున్నారు. మునగాల, కోదాడ టౌన్, హాలియా, చిలుకూరు, నేలకొండపల్లి, హుజూర్ నగర్, నడిగూడెం, మిర్యాలగూడ టూ టౌన్, గరిడేపల్లి పీఎస్ ల పరిధిలో 9 బీఎస్ఎన్ఎల్​టవర్స్ కేబుల్స్ ను కట్టర్, హ్యాక్ సా బ్లేడ్ తో కట్ చేసి చోరీ చేసినట్టు చెప్పారు. 

ఆ కేబుల్స్ ను కాల్చి కాపర్ వైర్ ను తీసి బస్తాల్లో నింపుకుని హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల, పటాన్ చెరువు ఏరియాలో ఫ్యాక్టరీల్లో అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద రూ. 2.75లక్షల నగదు, 270 మీటర్ల ఆర్ఎప్ కేబుల్, ఫోర్డ్ కారు, కట్టర్, హ్యాక్ సా బ్లేడ్ ను స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో శ్రావణ్ కుమార్ బీఎస్ఎన్ఎల్ టవర్స్ లో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటికే అతనిపై 4  కేసులు ఉన్నాయి. శ్రావణ్​కుమార్​ పరారీలో ఉండగా.. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది  కొండల్, ఎం. రామారావును  రివార్డులు అందించారు.