మేం గెలిస్తే మీ ఇండ్లలోకి బెంజ్ కార్లు తెస్తాం

మేం గెలిస్తే మీ ఇండ్లలోకి బెంజ్ కార్లు తెస్తాం

కేసీఆర్ నవంబర్ 29న కరీంనగర్ లోని ఏ అలుగునూరు వంతెన వద్ద దీక్ష కోసం వెళ్తూ కేసీఆర్ డ్రామాలాడాడో .. అక్కడి నుంచే మన అభివృద్ధికి బాటలు పడాలన్నారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగి బీసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం ఇప్పుడు ప్రమాదంలో ఉందన్నారు. ఇలాంటి వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకువస్తామన్నారు.  75 సంవత్సరాలుగా ఈ పాలకుల తీరుతో మనం ఏడుస్తూనే ఉన్నామన్నారు ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నాయన్నారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు.. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయలాంటి పథకాల కాంట్రాక్టులనీ అధిపత్య వర్గాల దగ్గరే ఉన్నాయన్నారు. ఆ కాంట్రాక్టుల్లో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలున్నారు. అగ్రకులాల వారే స్కూళ్లు, యూనివర్శిటీలు, ఆస్పత్రులు ఎందుకు పెట్టగలుగుతున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

తాము మాత్రం కూలీలుగా, పేషెంట్లుగా, అత్యాచార బాధితులుగా ఎందుకుంటున్నామన్నారు. కరోనా కాలంలో మా శవాల మీద మీరు డబ్బులేరుకున్నారని మండిపడ్డారు. మన సీఎంకు ఆరోగ్యం బాగాలేకపోతే యశోద ఆస్పత్రికి పోతాడని... తాను మాత్రం గాంధీ ఆస్పత్రికి పోతానన్నారు. బహుజన రాజ్యం వస్తే ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు... కార్పోరేట్ సంస్థలకంటే మిన్నగా తీర్చిదిద్దుతామన్నారు. మన దగ్గర దోచుకున్న డబ్బుల్లో 25 శాతం ఎన్నికలప్పుడు బయటకు తీశారన్నారు. ఈటల రాజేందర్ తప్పుడు పార్టీలో చేరారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. ఏ పార్టీ అయితే బీసీ కులగణన  చేయనంటుందో.. ఆ పార్టీలో ఈటెల ఉన్నారన్నారు. ఆయన ముదిరాజ్ బహుజన బిడ్డ... కానీ ఆయన చేరింది తప్పుడు పార్టీ అని విమర్శించారు. హుజురాబాద్ లో వేల కోట్ల రూపాయలు ఈటలను ఓడించేందుకు కేసీఆర్ కుమ్మరించారన్నారు. హుజురాబాద్ లో పంచిన డబ్బులన్నీ కాంట్రాక్టర్ల నుంచి కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చాయన్నారు. ఎన్నికలప్పుడు డబ్బులన్నీ మన కులసంఘాల నాయకులపై కుమ్మరించి.. మన ఓట్లను వాళ్లకు వేయించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. 

54 వేల ఎస్సీ ఓట్ల కోసమే దళితబంధు పథకం హుజురాబాద్ లో సీఎం పెట్టారని విమర్శించారు. సీఎంకు దళితులపై ప్రేమ ఉంటే అవే డబ్బులతో స్కూళ్లు, యూనివర్శిటీలు  పెట్టి వారికి చదువు, ఉపాధి కల్పించాలన్నారు.  ఒకప్పుడు మతకల్లోలుంటే.. ఇప్పుడు కేసీఆర్ కుల కల్లోలాలు సృష్టిస్తున్నాడన్నారు. కులాల జనాభా ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఇవ్వాలన్నారు. 

కేసీఆర్ సొంతంగా రాజ్యాంగం రాస్తారని.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బాగులేదని చెబుతున్నారన్నారు. అందరూ ధర్నాలు చేసేసరికి.. దళితుల కోసమే రాజ్యాంగం మార్చాలని చెబుతున్నారన్నారు. ఎస్సీల, బీసీల రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగంలోని ఏ అధికరం ఆపిందో చెప్పాలన్నారు.  కేసీఆర్ రాజ్యాంగంతో మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ఓటు అనే ఆయుధంతో ఎన్నికల్లో మన వాళ్లను గెలిపించుకుందామన్నారు. పోలింగ్ రోజు ఏనుగు గుర్తుమీద ఓటేయాలని ఇప్పటి నుంచి అనుకోవాలన్నారు. మనం బాగుపడాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలన్నారు. బీఎస్పీ గెలిస్తే.. మీ ఇండ్లలోకి బెంజ్ కార్లు వచ్చేలా చేస్తానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గుడిసెలో పుట్టిన బీఎస్పీ.. గడీలను బద్దలు కొట్టడానికి వచ్చిందన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మనం ట్రిపుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుకుందామన్నారు.

ఇవి కూడా చదవండి:

ఒడిశాలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన