భార్యాభర్తల మధ్య ఎన్నికల చిచ్చు

భార్యాభర్తల మధ్య ఎన్నికల చిచ్చు
  •     మధ్యప్రదేశ్‌‌లోని బాలాఘాట్‌‌ లోక్‌‌సభ నియోజకవర్గంలో ఘటన

బాలాఘాట్: లోక్​సభ ఎన్నికలు ఇద్దరు భార్యాభర్తల తాత్కాలిక ఎడబాటుకు కారణమయ్యాయి. మధ్యప్రదేశ్‌‌లోని బాలాఘాట్‌‌ లోక్‌‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ​నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్మే, మాజీ ​ఎంపీ కంకర్ ముంజరే మళ్లీ పోటీ చేస్తున్నారు. అతని భార్య అనుభా ముంజరే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను ఫాలో అవుతున్నపుడు ఒకే ఇంట్లో ఉండడం సరికాదనే ఉద్దేశంతో కంకర్ ముంజరే శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు.

నేను నా ఇంటిని వదిలేసి.. డ్యామ్ సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. విభిన్న పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో నివసిస్తుంటే.. అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు" అని ముంజరే చెప్పారు. ఈ నెల 19న పోలింగ్ ముగిసిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వెళతానని తెలిపారు. ఈ ఘటనపై ఆయన భార్య అనుభా స్పందిస్తూ.. తన భర్త నిర్ణయం పట్ల తాను బాధపడ్డానని తెలిపారు. ఓ మహిళ తాను చనిపోయే వరకు తన అత్తగారింటిని వదిలి వెళ్లదని ఆమె పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో పరస్వాడ సెగ్మెంట్​ నుంచి గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థిగా తన భర్త, బాలాఘాట్ సెగ్మెంట్​నుంచి తాను కాంగ్రెస్ టికెట్‌‌పై పోటీ చేశామని, అప్పుడు ఇద్దరం కలిసే ఉన్నట్లు తెలిపారు.