పార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మునుగోడు

పార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మునుగోడు

ఆధిపత్యవర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాలని.. ఆ ప్రాంత అభివృద్ధి కోసం బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎంతో పోరాడి సాధించిన తెలంగాణ.. దొరల చేతిలోకి వెళ్లిందని..బడా పారిశ్రామికవేత్తలకు పేదప్రజల భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. భూములను గుంజుకుంటున్న పార్టీలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏంచేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో మహిళలు చనిపోతే సీఎం వారి కుటుంబాలను పరామర్శించే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు వైద్యం కూడా అందడం లేదనడానికి ప్రతిరోజు ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్న నిర్లక్ష్య ఘటనలే సాక్ష్యాలని మండిపడ్డారు. హాస్టల్స్ లో పురుగుల అన్నం పెడుతున్నారని.. సరిగ్గా తిండి దొరకక ఎంతో మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. 

విద్యా, వైద్యం అందించలేని ఈ సర్కార్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఆధిపత్య వర్గాల పార్టీలకు ఓటేస్తే మనకు ఇలాంటి తిప్పలు తప్పవన్నారు. పేదల పక్షాన పక్షాన నిలబడే పార్టీ బీఎస్పీ మాత్రమే అని..మునుగోడు ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.